అవంతి మంత్రి ప‌ద‌వి ఊస్టింగ్‌… అందుకేనా కారాలు మిరియాలు…?

ఏపీలో కొద్ది రోజులుగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు పార్టీ మార్పు వార్త పెద్ద హాట్ టాపిక్‌గా న‌డుస్తోంది. గంటా పార్టీ మార్పు ఈ నెల‌లోనే ఉంటుంద‌ని.. ఆయ‌న పార్టీ మారేందుకు ముహూర్తం కూడా పెట్టేసుకున్నార‌ని సీఎం జ‌గ‌న్ సైతం ఆయ‌న్ను పార్టీలోకి తీసుకునేందుకు ఓకే చెప్పేశార‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న పార్టీ మార్పుపై విశాఖ జిల్లాకే చెందిన ఆయ‌న మాజీ శిష్యుడు, ప్ర‌స్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ రేంజ్లో కారాలు మిరియాలు నూరుతున్నారు. గంటా ప్ర‌భుత్వంపైనో.. వైసీపీపై ప్రేమ‌తోనే పార్టీ మార‌డం లేద‌ని.. ఆయ‌నపై ఉన్న భూక‌బ్జా కేసుల నుంచి త‌ప్పించుకునేందుకే పార్టీ మారుతున్నార‌ని అవంతి బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

 

గంటా వైసీపీలోకి రావ‌డంతో మంత్రి అవంతితో పాటు వైఎస్సార్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి కూడా ఇష్టంలేద‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే గంటా త‌న‌తో పాటు త‌న వ‌ర్గం ఎమ్మెల్యేలు ఒక‌రిద్ద‌రు.. మాజీ ఎమ్మెల్యేల‌ను కూడా తీసుకుని మ‌రీ వైసీపీ కండువా క‌ప్పుకోబోతున్నార‌ని అంటున్నారు. గంటా త‌న వ‌ర్గాన్ని భారీగా తీసుకువ‌చ్చి జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌న స‌త్తా చాటుకుని జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంత్రి ప‌ద‌వి సొంతం చేసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. అందుకే అవంతి ఆయన పార్టీ మార్పును స్వాగ‌తించ‌డం లేదంటున్నారు.

 

ఒక‌వేళ ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ అనుకుంటే వ‌చ్చే జీవీఎంసీ ఎన్నిక‌ల్లో మెజార్టీ సీట్ల‌తో పాటు మేయ‌ర్ సీటు, డిప్యూటీ మేయ‌ర్ సీటు కూడా గంటా వ‌ర్గానికే కట్ట‌బెట్టే చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయ‌ట‌. ఏదేమైనా విశాఖ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం గంటా పార్టీ మార్పు అంశంపై పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. 2019 లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి నాలుగో సారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే గత కొంతకాలంగా టీడీపీ నాయకత్వంతో అంటీముట్టనట్టుగా గంటా వ్యవహరిస్తున్నారు

Leave a comment