వైసీపీలోని రెడ్లు అందరూ ఇప్పుడు ఓ మంత్రిపై కారాలు మిరియాలు నూరుతున్నారట. తమకు అందాల్సిన మంత్రి పదవిని సదరు జూనియయర్ ఎమ్మెల్యే లాక్కోవడంతో పాటు తమ రాజకీయ భవిష్యత్తునే సవాల్ చేస్తూ.. తమను అణగదొక్కుతున్నాడని భావిస్తోన్న ఆ రెడ్లు ఇప్పుడు సదరు మంత్రిని టార్గెట్‌గా చేసుకుని రాజకీయం చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ మంత్రి ఎవరో కాదు నెల్లూరు జిల్లాకు చెందిన భారీనీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్. సినిమాల్లో నెల్లూరు పెద్దా రెడ్లు అనే డైలాగ్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలుగా రెడ్ల హవానే ఎక్కువ.
టీడీపీ అధికారంలో ఉన్నా.. వైసీపీ అధికారంలో ఉన్నా కూడా కూడా రెడ్డి సామాజిక వర్గం హవానే ఎక్కువ. ఏ పార్టీ అధికారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి ఓ మంత్రి ఖచ్చితంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కీలకంగా చక్రం తిప్పారు. మరో మంత్రి నారాయణ ఉన్నా పెత్తనం సోమిరెడ్డిదే అయ్యింది. ఇక ఇప్పుడు ఇదే జిల్లాలో జగన్ ప్రభుత్వంలో రెడ్డి వర్గానికి చెందిన గౌతమ్‌రెడ్డితో పాటు మరో మంత్రి అనిల్ కుమార్ ఉన్నా అనిల్‌దే దూకుడు కనిపిస్తోంది. అనిల్ అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైలెట్ అవుతుడడంతో పాటు మీడియా వర్గాల్లో కూడా బలంగా తన వాయిస్ వినిపిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వంలోనే రెడ్ల హవా ఉందని.. అలాంటిది తమ ప్రభుత్వం ఉన్నా కూడా రెడ్లకు ప్రాధాన్యం లేకుండా పోవడం ఏంటని. అనిల్ పెత్తనంతో తాము రాజకీయంగా వెనకపడిపోతున్నామన్న భావన వారిలో ఉందని చర్చించుకుంటున్నారట. వాస్తవానికి జిల్లాలో రెడ్డి వర్గం నుంచి సీనియర్ ఎమ్మెల్యేలు అయిదారుగురు మంత్రి పదవి రేసులో ఉన్నా కూడా జగన్ రెండోసారి గెలిచిన అనిల్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అయితే అనిల్ దూకుడు ముందు వారు ఆగలేకపోతున్నారన్న చర్చలు ఉన్నాయి.
ఇప్పుడు ఈ పెద్దా రెడ్లు అయిన ఎమ్మెల్యేలకు అధికారులు కనీసం స్పందించడం లేదు అని.. అసలు రెడ్లకు ప్రాధాన్యమే ఇవ్వడం లేదు అని కుమిలిపోతున్నారట. దీంతో ఇప్పుడు వారంతా సదరు మంత్రి టార్గెట్‌గా మీటింగ్ పెట్టుకుని భవిష్యత్ కార్యాచారణపై ఎలా ముందుకు వెల్లాలనే అంశంపై చర్చించుకోబోతున్నట్టు టాక్…?