ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తూనే ఉంది. అన్నిదేశాల్లో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎలాగైనా కరోనాకు చెక్ పెట్టేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్‌ను కనుగునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చేది తామేనంటూ రష్యా మరోసారి ప్రకటించింది. కరోనా టీకాను ఆగస్టు 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు రష్యా పదేపదే చెబుతోంది. రష్యాలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి అనేక ప్రయోగాలు జరుగుతున్నా.. సెచినోవ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలు ఇస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నారు.
ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్.. ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తొలి కరోనా వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది. ఇదే క్రమంలో ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా నిలువనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 3 నాటికి ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.అయతే రష్యా కరోనా టీకా చివరి దశ ట్రయల్స్ పూర్తికాక ముందే త్వరగా కోవిడ్19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తెస్తామని ప్రకటనలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మెడిసిన్ రూపకల్పన విషయంతో తమకు తోచిన సాయాన్ని అందిస్తామని, అయితే నాణ్యతా ప్రమాణాలు పాటించి టీకాను తయారు చేస్తున్నారని ఓ ప్రకటనలో తెలిపింది.
రష్యాకు చెందిన గామాలెయ ఇన్‌స్టిట్యూట్, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంయుక్తంగా ఈ టీకాను రూపొందిస్తున్నాయి. డ్రగ్ రెగ్యూలేటర్ల నుంచి అనుమతి లభిస్తే సాధ్యమైనంత త్వరగా కోవిడ్19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ ఒక కథనం ప్రచురించింది. అయితే కోవిడ్19 వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సంబంధించిన ఎలాంటి ఫలితాలను విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మనుషులపై ప్రయోగదశలో భాగంగా జులై 27న ఐదుగురు వాలంటీర్లకు రష్యా దేశ వైరాలటీ ఇన్‌స్టిస్టూట్ ఈ టీకాను ఇవ్వగా.. ప్రస్తుతానికి ఏ అనారోగ్య సమస్యలను ఎదుర్కోలేదని తెలిపింది. కరోనాకు టీకాను అతి త్వరగా తీసుకురావాలన్న యోచనతో ఆరోగ్య ప్రమాణాలను రష్యా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.