ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ కొనసాగిన 138 రోజుల్లో లక్ష పాజిటివ్ కేసులు నమోదు అయితే గత 12 రోజుల్లోనే ఏకంగా రోజుకు 10 వేల కేసులతో మరో లక్ష కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఓ వైపు కరోనా నుంచి కోలుకుని కొందరు డిశ్చార్జ్ అవుతున్నా కొత్త కేసులు రోజుకు 10 వేలు కావడంతో ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దేశంలోనే ఏపీ కరోనాలో కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. మహారాష్ట్ర 1.47 లక్షల యాక్టివ్ కేసులతో ఉంటే రెండో స్థానంలో ఏపీ 87 వేల యాక్టివ్ కేసులతో ఉంది.
ఏపీలో ఎక్కువ పరీక్షలు చేయడంతోనే కేసులు ఎక్కువుగా ఉన్నాయని ప్రభుత్వం సమర్థించుకుంటున్నా బెంగాల్లో కూడా ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కరోనా కొత్త కేసుల సంఖ్య ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అయితే ఏపీలో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. భారీగా డిశ్చార్జిలు పెరిగినా.. యాక్టివ్ సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని.. ఇది ఒకటి, రెండు నెలల్లో కట్టడి కాకపోతే మరణాల సంఖ్యను ఊహించలేమని చెపుతున్నారు.
కరోనా కేసుల్లో ప్రతి 10 లక్షల మందికి 1168 అనేది దేశ సగటు. ఏపీలో ఇది 4,156గా ఉంది. దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దీనినిబట్టి ఏపీలో కరోనా ఎంత డేంజర్ పరిస్థితుల్లో ఉందో తెలుస్తోంది.