కరోనా వైరస్.. ఇప్పట్లో ఈ ప్రపంచాన్ని వీడే అవకాశాలు కనిపించడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఈ వైరస్ బారిని పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో బాంబు పేల్చింది. ఈ మహమ్మారి ప్రభావం ఏకంగా మరో పదేళ్ల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ హెచ్చరించారు. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల డబ్ల్యూహెచ్వో అత్యవసరంగా నిర్వహించిన సమావేశంలో టెడ్రోస్ కీలక విషయాలను ప్రస్తావించారు.
కరోనా మహమ్మారి ప్రభావం పదేళ్ల పాటు ఉంటుందని.. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించాలని టెడ్రోస్ సూచించారు. ఇటువంటి వ్యాధులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయని.. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం గమనార్హం. అంటే.. ఇప్పట్లో కరోనా మహమ్మారి మనల్ని విడిచిపెట్టే అవకాశం ఏమాత్రమూ లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పారు. వైరస్ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశాల్లోనూ మరోసారి వైరస్ విజృంభిస్తోందని టెడ్రోస్ గుర్తుచేశారు.
ఇక వైరస్ బయటపడిన మొదటి రోజుల్లో పెద్దగా వైరస్ ప్రభావానికి గురికాని దేశాలు సైతం ఇప్పుడు తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని ఆ సమావేశంలో టెడ్రోస్ నొక్కి చెప్పారు. అంటే.. ముందుముందు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. 2021 తొలినాళ్లలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చని గతవారం డబ్ల్యూహెచ్ఓ తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కోటి 70లక్షల వైరస్ బారినపడగా.. 7 లక్షల మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 47 లక్షల మందికి వైరస్ నిర్దారణ కాగా.. 1.56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.