మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైందా ? ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కాంగ్రెస్ లో కలిపిన చిరు గత నాలుగైదేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక పేరుకు చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నా ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తమ్ముడు జనసేన పార్టీ పెట్టినా ప్రత్యక్షంగా సపోర్ట్ చేయని చిరు పరోక్షంగా తన సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. ఇక చిరు ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్నా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రావాలన్న తన ఆతృతను తాజాగా బయట పెట్టుకున్నారన్న చర్చలు ఏపీ రాజకీయాల్లో వస్తున్నాయి.
తాజాగా చిరంజీవి ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు ను కలిశారు. ఏపీ బిజెపి అధ్యక్షులు గా బాధ్యతలు చేపట్టిన వీర్రాజుకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే పుష్పమాల, శాలువాతో చిరంజీవి సత్కరించారు. వీరిద్దరి మధ్య అంతర్గతంగా ఏం జరిగిందన్నది తెలియదు కాని.. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చిరంజీవి సూచించినట్టు మెగా కాంపౌండ్ వర్గాలు మ్యాటర్ లీక్ చేశాయి. అలాగే 2024 లో బిజెపి, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని కూడా చిరు ఆకాంక్షించినట్టు టాక్..?
ఏదేమైనా నిన్నటి వరకు రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న చిరు ఇప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రాగానే వెంటనే ఆయన్ను కలిసి సన్మానించడాలు.. తన తమ్ముడు జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న బీజేపీ + జనసేన కూటమి అధికారంలోకి రావాలని ఆక్షాక్షించడాలు చూస్తే చిరుకు మళ్లీ రాజకీయాల్లోకి రావాలన్న కూతూహాలం ఉన్నట్టే కనిపిస్తోంది. మొత్తానికి చిరుకు ఈ రెండు పార్టీల పొత్తుతో మరోసారి తన సామాజిక వర్గం రాజకీయంగా పుంజుకునే ఛాన్స్ ఉందన్న ఆశ అయితే కలిగినట్టు ఉంది.
ఈ క్రమంలోనే తాను కూడా వీర్రాజును కలవడంతో తనలో రాజకీయ ఆశక్తతను చాటుకోవడంతో పాటు వీలుంటే వచ్చే ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు పుంజుకున్న తీరును బట్టి తన తమ్ముడు జనసేనలోకి తాను రావొచ్చేమోనన్న హింట్ అయితే ఇచ్చాడు. మరి చిరు రీ ఎంట్రీలో అయినా రాజకీయంగా హీరో అవుతాడో ? లేదో ? చూద్దాం.