‘చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామా చేసి కుప్పం నుంచి గెలవాలి’..ఇది మంత్రి కొడాలి నాని చంద్రబాబుకు విసిరిన సవాల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్, అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారని, మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. ఇక దీనికి ప్రతిగా కొడాలి నాని బాబుని కుప్పంలో రాజీనామా చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు.
అయితే చంద్రబాబు సవాల్‌ని పట్టించుకుని జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ అసలు లేదు. ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా…2019 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు మళ్ళీ రావడం చాలా కష్టం. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాస్త మంచిగానే సీట్లు తెచ్చుకున్నా, కోస్తాలో మాత్రం వైసీపీకి గట్టి దెబ్బ పడుతుందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే అమరావతికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ఇక ఇందులో కొడాలి నాని సవాల్ చేసినట్లుగా చంద్రబాబు కూడా కుప్పం ఎమ్మెల్యేగా రాజీనామా చేయొచ్చు. అయితే కుప్పం నుంచి మళ్ళీ గెలవరనే ఉద్దేశంతోనే కొడాలి సవాల్ చేశారు. కానీ పరిస్థితి చూస్తే అలా కనబడటం లేదు. కుప్పంలో బాబుని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. వరుసగా 7 సార్లు కుప్పం నుంచి భారీ మెజారిటీలతో గెలిచిన బాబు, ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ గతంలో వచ్చిన మెజారిటీ కంటే అధ్యధిక మెజారిటీతో గెలవగలరు.
1989 నుంచి ఆయన వరుసగా కుప్పంలో గెలుస్తూ వస్తున్నారు. ఎందుకంటే కుప్పం మామూలుగానే బాబు అడ్డా, పైగా అక్కడి ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారు. వారికి అమరావతినే కాస్త దగ్గరగా ఉంటుంది. ఇంకా విశాఖ అంటే చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి కొడాలి నాని చేసిన సవాల్‌లో చంద్రబాబు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా కుప్పంలో బాబు ఓడించడం అసాధ్యం.