ఆ లీడ‌ర్ వైసీపీలోకి…. టీడీపీకి గుడ్ న్యూసేగా మ‌రి…!

ఆ లీడ‌ర్ వైసీపీలోకి వెళితే టీడీపీకి గుడ్ న్యూస్ ఏంట‌న్న షాక్‌లో ఉన్నారా ? ఇప్పుడు ఓ హ్యాట్రిప్ ప్లాపుల లీడ‌ర్… జంపింగ్ జ‌పాంగ్‌ల‌కు కేరాఫ్ అయిన ఓ నేత ఈ రోజు పార్టీ మారుతున్నారు. ఆయ‌న వైసీపీలోకి వెళుతుండ‌డంతో స్థానిక కేడ‌ర్ ఖుషీగా ఉంది. టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎన్నారైగా ఉన్న ఆయ‌న 2009లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన చిరంజీవి ప్ర‌జారాజ్యం పెట్ట‌డంతో ఆ పార్టీ నుంచి భారీగా ఖ‌ర్చు చేసి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

 

2014 ఎన్నిక‌ల్లో పార్టీ మారి వైసీపీ నుంచి మ‌ళ్లీ ఎంపీగా పోటీ చేసి నాటి టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో 2 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరి మళ్లీ ఎంపీగా పోటీ చేసి వంగా గీత చేతిలో పరాజయం చెందారు. ఇలా కాకినాడ ఎంపీగా వ‌రుస‌గా మూడు సార్లు.. మూడు పార్టీల నుంచి పోటీ చేసిన ఆయ‌న హ్యాట్రిక్ ఓట‌ములు కొట్టారు.

 

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత టీడీపీకి దూరంగా ఉన్న ఆయ‌న మళ్లీ వైసీపీ గూటికి చేరనున్నారు. వ్యాపార రంగంలో ఉన్న సునీల్ త‌న అవ‌స‌రాల నేప‌థ్యంలో పార్టీ మారుతున్న‌ట్టు టాక్‌..? ఇక వైసీపీలో ఉండ‌గా ఆయ‌న‌కు జ‌గ‌న్‌తో, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డితో పొస‌గ‌కే టీడీప‌లోకి వచ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే పార్టీలోకి వెళుతున్నారు. సునీల్ టీడీపీలో ఉన్నా పెద్ద ఉప‌యోగం లేద‌ని.. ఇప్ప‌టికే మూడు పార్టీలు మారార‌ని.. ఆయ‌న పార్టీ మారిపోతే ఇక్క‌డ కాపు వ‌ర్గానికే చెందిన మ‌రో నేత‌కు ప‌గ్గాలు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని టీడీపీ వ‌ర్గాలు ఖుషీగా ఉన్నాయ‌ట‌.