ఏపీ బీజేపీలో అధ్యక్షుడు అలా మారారో లేదో అప్పుడే కలకలం రేగింది. నిన్న మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పదవి నుంచి దిగిపోయి.. ఆ స్థానంలో నియమితులైన సోము వీర్రాజు.. ఇంకా పార్టీ ఏపీ శాఖ పగ్గాలు చేపట్టలేదు. ఈ నెల 11న ఆయన ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆ రోజు పగ్గాలు చేపట్టనున్నారు. అయితే, ఇంతలోనే పార్టీ తీవ్ర కలకలం రేగుతోంది. అమరావతి విషయంపై పార్టీ స్టాండు చెప్పాలనే అంతర్గత కలహం తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న కన్నా.. ఆది నుంచి అమరావతికి అండగా నిలిచారు.
అమరావతి ప్రాంతానికి వెళ్లి.. మరీ రైతుల ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతి సందర్భంలోనూ కన్నా రాజధానిని సపోర్టు చేశారు. జగన్‌పైనా.. ఆయన ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. పైగా అవసరమైతే.. పార్టీ అధిష్టానంతోనూ తను ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అని ప్రకటించారు. జీవీఎల్ వంటి కేంద్రంలో బలమైన బీజేపీ నేతతోనూ కన్నా విభేదించారు. అలాంటి పరిస్థితిలో స్థానికంగా గుంటూరు నేతలకు, ముఖ్యంగా అమరావతిని సపోర్టు చేస్తున్న నాయకులకు కన్నా తురుపు ముక్కగా మారారు. అయితే, ఇప్పుడు సోము పగ్గాలు చేపట్టకముందుగానే ఈ విషయంతో విభేదించారు.
అమరావతి విషయం కేంద్రం పరిధిలోకి రాదని చెప్పారు. పోనీ.. పార్టీ అయినా.. బీజేపీ సపోర్టు చేస్తుందా? అంటే.. ఆ విషయంపైనా ఆయన మౌనం వహించారు. దీంతో గుంటూరు జిల్లాలోని బీజేపీ నేతలు మరింత ఇరకాటంలో పడ్డారు. వాస్తవానికి ఇప్పటి వరకు గుంటూరులో పార్టీని నిలబెట్టేందుకు చాలా మంది నాయకులు ప్రయత్నించారు.
ఈ క్రమంలో వారికి అందివచ్చిన ఏకైక అంశం.. అమరావతి. దీనిని అడ్డుపెట్టుకుని ఎదగాలని నాయకులు భావించారు. అయితే, ఈ వ్యవహారంలో సోము చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని పక్కన పెడితే.. ప్రధానంగా మూడు జిల్లాలపై ప్రభావం పడిందని వీరు ఆవేదన చెందుతున్నారు. దీంతో ఇప్పుడు ఇదే కమలం పార్టీ కలకలం రేగింది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.