ఆ విషయంలో అచ్చెన్నని టచ్ చేయలేకపోతున్న జగన్…

ఊహించని విధంగా టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడుని జగన్ ప్రభుత్వం ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్‌కు ముందే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అచ్చెన్నకు ఇప్పుడు కరోనా కూడా వచ్చింది. పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అచ్చెన్నకు కరోనా వచ్చిందని టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. పైగా ఆయనకు బెయిల్ కూడా రాకపోవడంతో…ప్రభుత్వమే కావాలనే బెయిల్ రాకుండా అడ్డుకుంటుందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

 

అయితే ఆయన్ని ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టినా టెక్కలి నియోజకవర్గంలో మాత్రం టీడీపీని వీక్ చేయలేరని చెబుతున్నారు. మొదటి నుంచి టెక్కలి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి ఇక్కడ టీడీపీ తిరుగులేని విజయాలు సాధిస్తుంది. 2004, 2009 తప్ప మిగతా అన్నీ ఎన్నికల్లో టెక్కలిలో టీడీపీదే విజయం. ఇక 1996, 1999, 2004 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి గెలిచిన అచ్చెన్న 2009లో టెక్కలి నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

 

ఇక 2014లో గెలిచిన అచ్చెన్న చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే అచ్చెన్న మరోసారి టెక్కలి నుంచి గెలిచారు. అయితే ప్రతిపక్షంలో కూర్చున్న కూడా అచ్చెన్న చంద్రబాబుకు కుడిభుజంగా వ్యవహరిస్తూ, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఈ విధంగా పోరాటం చేస్తూ జగన్‌ ప్రభుత్వానికి పంటికింద రాయిలా తయారయ్యారు.

 

ఈ క్రమంలోనే అనూహ్యంగా అచ్చెన్నని ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయ్యాక టెక్కలిలో అచ్చెన్న బలం ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా అక్రమంగా అరెస్ట్ చేశారనే సానుభూతి ఆయనపై పెరిగింది. ఇప్పటికీ టెక్కలి ప్రజలు అచ్చెన్నకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటున్నారని తెలిసింది. మొత్తానికైతే అచ్చెన్నని అరెస్ట్ అయితే చేయించగలిగారు గాని ఆయన బలం మాత్రం తగ్గించలేకపోయారు.