సినిమా: వరల్డ్ ఫేమస్ లవర్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి
సంగీతం: గోపీసుందర్
నిర్మాత: కెఏ వల్లభ, కెఎస్ రామారావు
దర్శకత్వం: క్రాంతి మాధవ్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, వరుసగా సినిమాలు చేస్తూ దూకుడుపై ఉన్నాడు. గీతగోవింది వంటి క్లాసిక్ హిట్ అందుకున్న ఈ హీరో తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో మనముందుకు వచ్చాడు. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబట్టిందో రివ్యూలో చూద్దాం.
కథ:
గౌతమ్(విజయ్ దేవరకొండ) యామిని(రాశి ఖన్నా)లు తమ కాలేజీ లైఫ్ నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ మధ్యలో వారు బ్రేకప్ అవుతారు. అటు శీనయ్య(విజయ్ దేవరకొండ) తన భార్య సువర్ణ(ఐశ్వర్య రాజేష్)తో కలిసి జీవిస్తుంటాడు. అయితే గౌతమ్, యామినిల జీవితంలోకి ఇసా(ఇసాబెల్), శీనయ్య-సువర్ణ జీవితంలోకి స్మిత(కేథరిన్ త్రేసా) ఎందుకు వస్తారు..? వారు రావడంతో వీరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి? ఇంతకీ గౌతమ్,శీనయ్యల మధ్య సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా అనగానే వరల్డ్ ఫేమస్ లవర్‌పై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. ఈ సినిమాను సత్తా ఉన్న దర్శకుడు క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎలాగైనా చూడాలని ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో గౌతమ్, యామినిల లవ్‌స్టోరీని మనకు చూపించారు. వారు జీవితంలో ఎందుకు విడిపోయారు అనే అంశాన్ని బాగా చూపించారు. అటు శీనయ్య, సువర్ణల మధ్య నడిచే రొమాంటిక్ యాంగిల్‌ని కూడా బాగా చూపించారు. ఓ మంచి బ్యాంగ్‌తో ఇంటర్వెల్‌ను తీసుకొచ్చాడు దర్శకుడు.
అటు సెకండాఫ్‌లో హీరోలు తమ ప్రేమను వేరే వారితో పంచుకోవడాన్ని చూపించారు. కథలోకి స్మిత, ఇసాలు ఎంట్రీ ఇవ్వడం, వారితో హీరోలు చేసే రొమాన్స్‌ను చూపించారు. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించి మంచి నోట్‌తో సినిమాను ముగింపు ఇచ్చాడు దర్శకుడు. ఇలాంటి లవ్ స్టోరీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఓ సమయంలో ఉంటుందని ఈ చిత్రం ద్వారా మనకు తెలపాలని చిత్ర యూనిట్ ప్రయత్నించింది.
ఓవరాల్‌గా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేమికుల రోజున రిలీజ్ అయ్యి కేవలం యూత్‌ను మాత్రమే టార్గెట్ చేసిందని చెప్పాలి. అయితే సహజత్వానికి చాలా దూరంగా ఉండే కొన్ని సీన్స్, అక్కడక్కడా ఉండే బోరింగ్ సీన్లు సినిమాకు బాగా మైనస్ అయ్యాయి. మొత్తానికి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఓ యావరేజ్ మూవీగా నిలవడం ఖాయం.
నటీనటుల పర్ఫార్మెన్స్:
గౌతమ్, శీనయ్య పాత్రల్లో విజయ దేవరకొండ పర్ఫార్మెన్స్ సూపర్. రౌడీ హీరో ఈ సినిమాను తన పర్ఫార్మెన్స్‌తోనే లాగొచ్చాడు. రొటీన్ కథ అయినా మనోడి పర్ఫార్మెన్స్‌తో కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. రెండు పాత్రల్లో జీవించేశాడు మన రౌడీ స్టార్. ఇక హీరోయిన్లు కూడా తామేమీ తక్కవ కాదంటూ రెచ్చిపోయి నటించారు. రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్‌ల యాక్టింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కేథరిన్, ఇసాల కూడా బాగా చేసి మెప్పించారు. మిగతా పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో అవి తేలిపోయాయి.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు క్రాంతి మాధవ్ ఎంచుకున్న కథ బాగున్నా రొటీన్ కథ కావడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రేమకథను విభిన్నంగా చూపించాలని ప్రయత్నించిన దర్శకుడు ట్రాక్ తప్పి కథపై పట్టు తప్పాడు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా బొగ్గు గని ఎపిసోడ్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
వరల్డ్ ఫేమస్ లవర్ – కొంతమందినే మెప్పించాడు!
రేటింగ్:
3.0/5.0