తాతగా మారిన వర్మ.. తప్పలేదట!

వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా వివాదంగానే మారుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలకంటే ఆయన మాట్లాడే మాటలే వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇక తాజాగా రామ్ గోపాల్ వర్మ తాతగా మారాడు. ఇదేదో సినిమాలో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆయన నిజజీవితంలో తాతగా మారి అందరికీ షాకిచ్చాడు.

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తన కుటుంబానికి సంబంధించిన విషయాలు మీడియా ముందు తెలుపలేదు. కాగా తన మాజీ భార్య రత్నతో తెగతెంపులు చేసుకున్న వర్మ, అడపాదడపా తన కూతురిపై తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. తాజాగా వర్మ కూతురు ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమెరికాలో ఉండే రేవతి, తన బాయ్‌ఫ్రెండ్ ప్రణబ్‌ను 2013లో వివాహమాడింది. కాగా వారికి కూతురు పుట్టడంతో వర్మ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తన ఒక్కగానొక్క కూతురు తల్లి కావడంతో వర్మ సంతోషంగా ఉన్నట్లు, దీని గురించి ఆయన ఎలాంటి ట్వీట్ చేయలేదని తెలుస్తోంది. తన కూతురుపై ప్రేమను వర్మ పలుమార్లు వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ఇక వర్మ ప్రస్తుతం వరుసబెట్టి తన ప్రాజెక్టులను రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

Leave a comment