సినిమా: ప్రతిరోజూ పండగే
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జయకుమార్
మ్యూజిక్: థమన్
నిర్మాత: బన్నీ వాస్
దర్శకత్వం: మారుతి
రిలీజ్ డేట్: 20-12-2019
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రతిరోజూ పండగే ప్రేక్షకుల్లో మంచి అంచానలను క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా ముద్ర వేసుకుని నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకులు కూడా ధీమాగా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
సత్యరాజ్ కొడుకు కూతుళ్లు విదేశాల్లో సెటిల్ కావడంతో అతడు వారిని బాగా మిస్ అవుతాడు. దీంతో వారిని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ఓ ప్లాన్ చేస్తాడు. తనకు క్యాన్సర్ ఉందని చెప్పడంతో అతడిని చూసుకునేందుకు కొడుకు రావురమేష్, కూతుళ్లు ఇండియాకు వస్తారు. కాగా సత్యరాజ్ మనవడు సాయితేజ్(సాయి ధరమ్ తేజ్) అతడి మనసు తెలుసుకుని ఆయన కోరిక తీర్చాలని ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే కుటుంబంలో చెలరేగిన సమస్యలను సాయితేజ్ పరిష్కరించే ప్రయత్నాలు చేస్తాడు. ఈ సమయంలో సత్యరాజ్ గురించి ఆయన పిల్లలకు ఓ నిజం తెలుస్తోంది. ఇంతకీ సత్యరాజ్‌కు నిజంగానే క్యాన్సర్ ఉందా? సాయితేజ్ తన తాత కోరికను నెరవేరుస్తాడా? సత్యారజ్ కుటుంబం ఇండియాలో ఉంటుందా లేక తిరిగి వెళ్లిపోతుందా? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
ఈ సినిమా షూటింగ్ మొదట్నుండీ ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ పేర్కొంటూ వచ్చింది. అన్నట్లుగానే ఈ సినిమా చూస్తే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. గతంలో శతమానం భవతి సినిమా చూసిన వారికి ఈ సినిమా కథేమిటో ఇట్టే అర్ధమవుతుంది. ఇక సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో తన పిల్లలను ఇండియాకు రప్పించేందుకు సత్యరాజ్ తనకు క్యాన్సర్ ఉందని చెబుతాడు. ఈ క్రమంలో అతడి మనవడు సాయితేజ్ ఇండియాకు వచ్చి అతడి కోరికలను తెలుసుకుని ఒక్కొక్కటి తీరుస్తాడు. ఈ క్రమంలో ఏంజిల్ ఆర్నాగా రాశిఖన్నా ఎంట్రీ ఇవ్వడంతో ఆమెను ప్రేమిస్తాడు తేజు. కట్ చేస్తే వీరిద్దరి పెళ్లి జరగాలని కోరుతాడు సత్యరాజ్. ఒక చక్కటి ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.
సెకండాఫ్‌లో కథ సీరియస్ మూడ్‌లోకి వెళ్లి సత్యరాజ్ తన కుటుంబాన్ని తనతోనే ఉండాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో అతడికి సంబంధించిన ఓ విషయం తన కుటుంబానికి తెలుస్తోంది. దీంతో ఆయన కుటుంబం సత్యరాజ్ కోరికను ఏ విధంగా తీర్చుతుంది అనేది చాలా చక్కగా చూపించారు. ఒక ఇంట్రెస్టింగ్ నోట్‌తో సినిమాకు శుభం కార్డు వేశాడు దర్శకుడు. ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కావాల్సిన అంశాలన్నింటినీ సినిమాలో చూపించారు చిత్ర యూనిట్.
ఓవరాల్‌గా చూస్తే శతమానం భవతి సినిమా కథను పోలి ఉన్న కథ అని అనిపించేలోపే, ఆ సినిమాకు ఈ సినిమాకు పొంతన లేకుండా చేశాడు దర్శకుడు మారుతి. ఒక చక్కటి ఫ్యామిలీ సినిమాగా సంక్రాంతి పండగ ముందే వచ్చిందా అనే విధంగా ప్రతి రోజూ పండగే సినిమాను తెరకెక్కించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్:
సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతడి కష్టం మనకు తెరపై కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్‌లో అతడి నటన సూపర్. హీరోయిన్ రాశి ఖన్నా కూడా కామెడీతో కూడిన పాత్రలో మెప్పించింది. తాత పాత్రలో సత్యరాజ్ యాక్టింగ్ బాగుంది. రావురమేష్, ప్రభ, తదితర నటీనటులు తమ పరిధిమేర బాగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు మారుతి ఈ సినిమాను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. శతమానం భవతి లాంటి బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గతంలోనే వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి కథనంతో ప్రేక్షకులను మెప్పించడంలో అతడు పూర్తిగా సక్సె్స్ అయ్యాడు. కథను ఎక్కడా పక్కదారి పట్టకుండా పక్కా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించాడు. థమన్ సంగీతం పర్వాలేదు. ముఖ్యంగా బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
చివరగా:
ప్రతిరోజూ పండగే – కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా
రేటింగ్:
3.0/5.0