సినిమా: ఇద్దరి లోకం ఒకటే
నటీనటులు: రాజ్ తరుణ్, షాలిని పాండే, నాజర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: జీఆర్ కృష్ణ
లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో రాజ్ తరుణ్ గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా నటించిన తాజా చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కినట్లు చిత్ర పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు చూస్తే తెలుస్తోంది. ఇక ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
ఓ యాక్సిడెంట్ కారణంగా వర్ష(షాలిని పాండే), మహి(రాజ్ తరుణ్) ఒకేసారి ఒకే ఆసుపత్రిలో జన్మిస్తారు. చిన్నతనంలో వీరిద్దరు కలిసి పెరుగుతారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోతారు. కట్ చేస్తే.. 25 సంవత్సరాల తరువాత వీరిద్దరు మళ్లీ కలుస్తారు. అయితే వర్ష అప్పటికే రాజాతో రిలేషన్‌లో ఉంటుంది. కానీ మహి మాత్రం వర్షను ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో వారిద్దరు మంచి స్నేహితులవుతారు. కాగా వర్ష ఒక హీరోయిన్‌గా మారుతుంది. కానీ మహికి ఆరోగ్యపరంగా ఓ పెద్ద సమస్య ఉంటుందని తెలియడంతో వర్ష షాక్‌కు గురవుతుంది. ఇంతకీ వర్షకు మహి ప్రేమ విషయం తెలుస్తుందా? వారిద్దరి ప్రేమ సక్సెస్ అవుతుందా? మహి అనారోగ్యం కారణంగా అతడికి ఏమైనా జరుగుతుందా? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
దర్శకుడు జీఆర్ కృష్ణ రాసుకున్న ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు కథలో ఎలాంటి లోటపాట్లు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో హీరోహీరోయిన్ల చిన్నతనాన్ని చూపించడం, వారు ఎందుకు విడిపోయారు అనే అంశాలు ప్రేక్షకులకు ‘మనసంతా నువ్వే’ తరహా సినిమా కథలా అనిపిస్తుంది. కానీ హీరోహీరోయిన్లు పెద్దయ్యాక మహి వర్షకు తన ప్రేమ గురించి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ప్రయత్నిస్తుంటాడు. కానీ అతడి అనారోగ్య కారణాల వల్ల అతడు తన ప్రేమను చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో అతడి ఆరోగ్యం గురించి అందరికీ తెలియడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.
అటు సెకండాఫ్‌లో అందరూ మహి ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్న సమయంలో తన ప్రేమను ఎలాగైన వర్షకు తెలపాలని ప్రయత్నిస్తాడు మహి. తన స్నేహానికి మచ్చతేవద్దనే కారణంతో అతడు తన ప్రేమను చెప్పలేకపోతాడు. అయితే ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో హీరో ఆరోగ్యం క్షీణించడంతో ఒక ట్రాజెడీ ఫినిషింగ్‌తో సినిమాను ముగించాడు దర్శకుడు.
ఓవరాల్‌గా యూత్‌ను టార్గెట్ చేసుకుని తీసిన ఈ సినిమా వారికి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కొంత భాగం చాలా స్లోగా నెరేట్ చేయడం, సెకండాఫ్‌లో లాగింగ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడతారు. ఇక క్లైమాక్స్‌ను ట్రాజెడీగా ముగించేయడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. మొత్తంగా రాజ్ తరుణ్ చేసిన ఈ ప్రయత్నం కొంతమేర ప్రేక్షకులను ఆకట్టుకున్నా, ఓవరాల్‌గా అందరికీ నచ్చకపోవచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్:
రాజ్ తరుణ్ ఈ సినిమాలో గతసినిమాలకంటే కూడా చాలా బాగా నటించాడని చెప్పాలి. తన యాక్టింగ్‌లో చాలా మెచ్యురిటీని చూపించాడు. ముఖ్యంగా రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్‌లో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇక షాలిని పాండే కూడా ఈ సినిమాతో మరోసారి వావ్ అనిపించింది. అర్జున్ రెడ్డి సినిమాలో కనిపించిన షాలిని పాండే మనకు మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తుంది. మిగతా నటీనటలు వారి పాత్రల మేర బాగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు జీఆర్ కృష్ణ ఎంచుకున్న కథ బాగున్నా దాన్ని పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అనవసరపు సీన్స్‌తో ట్రాక్ తప్పించాడు. సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్‌ను కూడా ఆయన పెట్టకుండా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ చేసింది. ప్రతి ఫ్రేమ్‌ను చాలా బాగా చూపించాడు సమీర్ రెడ్డి. ఇక మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ఈ సినిమాకు సగం బలం అని చెప్పాలి. పాటలతో పాటు ఫీల్ గుడ్ బీజీఎంతో సంగీతం ప్రేక్షకులను అలరించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
చివరగా:
ఇద్దరి లోకం ఒకటే – యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్
రేటింగ్: 3.0/5.0