ఇక సినిమాలు చేయనంటున్న స్వీటీ

టాలీవుడ్ జేజమ్మగా అనుష్క తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్దపీట వేసిన అనుష్క ఆ తరువాత వరుసబెట్టి లీడ్‌ రోల్‌లో నటిస్తూ సినిమాలు చేస్తూ వచ్చింది. రుద్రమదేవి, బాహుబలి, సైరా వంటి సినిమాలలో కత్తి పట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు అలాంటి సినిమాలు చేయడానికి ససేమిరా అంటోంది.

అవును.. అనుష్క ఇకమీదట హిస్టారికల్ సినిమాలు చేయనని తేల్చిచెప్పేసింది. ప్రస్తుతం నిశబ్దం అనే సినిమాలో నటిస్తోన్న అనుష్క తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హిస్టారికల్ సినిమాలకు స్వస్తి చెప్పినట్లు తెలిపింది. దీనికి కారణం ఆ సినిమాలకు కేటాయించాల్సిన సమయం ఎక్కువగా ఉండటం, మేకప్ కోసం చాలా సమయం పడుతుండటం అని చెప్పుకొచ్చింది.

హిస్టారికల్ సినిమాలలో మంచి గుర్తింపు వస్తుందనే విషయం నిజమే అయినా ఆ సినిమాల కోసం చాలా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుందని..ఇకపై తాను అలాంటి సినిమాలకు నో చెబుతానంటూ కుండ బద్దలు కొట్టింది అనుష్క. బాహుబలి వంటి సినిమాల్లో అనుష్క కత్తి పట్టిన తీరును ప్రేక్షకులు ఇకపై మిస్ కావడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఏదేమైనా అనుష్క ఫ్యాన్స్‌కు మాత్రం ఇది ఖచ్చితంగా షాక్‌ను కలిగించే విషయం అని చెప్పాలి. తమకు ఎంతో ఇష్టమైన జేజమ్మ ఇకపై కత్తి పట్టదు అనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ నిర్ణయంపై అనుష్క మళ్లీ మాట మారుస్తుందేమో చూడాలి.

Leave a comment