బాలీవుడ్ సినిమా వార్ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగుతూనే ఉంది. బాక్సాఫీసు వద్ద హిందిలో భారీగా వసూలు చేస్తున్న వార్ సినిమా ఇతర భాషల్లో మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్ళు లేవనే చెప్పవచ్చు. వార్ సినిమాకు బాలీవుడ్ లో ఇప్పుడు పోటీ లేని పరిస్థితి ఉండటంతో దూకుడు మీదుంది. పాన్ ఇండియాగా తెరకెక్కిన సైరా చిత్రం ఎంతో కొంత బాలీవుడ్‌లో పోటీ ఇస్తున్నా, వార్‌కు దుర్గా పూజ, దసరా సందర్భంగా భారీ వారాంతం కలిసి వచ్చాయి. పండుగల సీజన్ కావడంతో వార్ మూవీ వసూళ్లు దండిగానే రాబట్టింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యువ హీరో టైగర్ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ మూవీ రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసి సల్మాన్ ఖాన్ భారత్ లైఫ్‌టైమ్ బిజినెస్‌ను అధిగమించింది. అక్టోబర్ 2న విడుదలైనప్పటి నుంచి ప్రతి రోజూ రూ 20 కోట్లుపైగా కలెక్ట్ చేస్తూ ఏడవ రోజు దసరా హాలిడేతో 2019లో మూడో అత్యధిక గ్రాస్ సాధించిన మూవీగా వార్ నిలిచింది.
దసరా సెలవులు కలిసివచ్చిన తొలివారంలో వార్ మూవీ రూ. 208 కోట్లు రాబట్టిందని, తమిళ్, తెలుగు వెర్షన్‌లను కలుపుకుని దేశవ్యాప్తంగా రూ. 215 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందట. రూ. 200 కోట్ల వసూళ్లు దాటిన వార్ కలెక్షన్లు ఇంకా నిలకడగా ఉండటంతో ముందుముందు సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని భావిస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇక తెలుగులో మాత్రం వార్ సినిమా అనుకున్నంత రేంజ్‌లో వసూలు చేయడం లేదు..