సైరా కలెక్షన్లు.. ఔరా అంటోన్న బాక్సాఫీస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహా రెడ్డి ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంతే భారీ సక్సెస్ టాక్‌ను తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ బయోపిక్ సినిమా మొదటి వీకెండ్ ముగిసే సరికి అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో తొలి వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో వరుసగా రెండుసార్లు చిరు ఈ ఫీట్ కొట్టాడు. ఇక దసరా సెలవుల అడ్వాంటేజ్ ఎటూ ఉండటంతో ఈ వారం కూడా సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు రావడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కాగా.. సినిమా బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకోవాలంటే మాత్రం ఇంకా బాగానే కలెక్ట్ చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేకపోవడంతో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో అంచనా వేస్తున్నారు సినీ వర్గాలు. ఇక చిరు విశ్వరూపం, భారీ తారాగణం కలిసి ఈ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి.

Leave a comment