టాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత బండ్ల గణేష్‌పై ఇటీవల ఓ పోలీసు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత మరియు వ్యాపారవేత్త పీవీపీని బండ్ల తన అనుచరులతో కలిసి ఇంటికి వెళ్లి బెదిరించినట్లు ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.
టెంపర్ సినిమా సమయంలో బండ్లకు చిత్ర నిర్మాణంలో ఫైనాన్స్ చేసిన పీవీపీ తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగ్గా.. ఇలా తనపై దాడికి దిగారంటూ పీవీపీ తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం విదితమే. అయితే అప్పట్నుండీ పరారీలో ఉన్న బండ్ల గణేష్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పీవీపీపై బెదురింపు విషయంలో ఆయనపై ఐపీసీ 420, 448, 506 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పీవీపీ తనపై ఫిర్యాదు చేసిన తరువాత కూడా బండ్ల గణేష్ తన కోపాన్ని సోషల్ మీడియాలో చూపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే ఆయన కటకటాలపాలు అయ్యారు. మరి ఇది ఎన్ని రోజుల తతంగమో చూడాలి అంటున్నారు విమర్శకులు.