సాహో సుజీత్ నెక్ట్స్ సినిమా ఏంటంటే..

సుజీత్ ఈ పేరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అవుతోంది. కొంద‌రు సుజీత్‌ను మంచిగా ప్రశంస‌లు కురిపిస్తుంటే.. కొంద‌రు మాత్రం ఇదేం చెత్త సినిమా తీశాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. ఏదేమైనా ఒక్క సినిమా అనుభ‌వంతో 25 సంవ‌త్స‌రాల‌కే ఇంత పెద్ద సినిమాను తీయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇండ‌స్ట్రీలో ఎవరి దగ్గరా అసిస్టెంటుగా పని చేయకుండానే.. షార్ట్ ఫిలిమ్స్ అనుభవంతో దర్శకుడిగా అవకాశం అందుకుని.. ‘రన్ రాజా రన్’ అనే చిన్న సినిమాతో పరిచయం అయి తొలి ప్ర‌య‌త్నంలోనే సూప‌ర్ హిట్ కొట్టాడు.

ఆ త‌ర్వాత ఏకంగా బాహుబ‌లితో నేష‌న‌ల్ క్రేజ్ అందుకున్న ప్ర‌భాస్‌తో రూ. 350 కోట్ల‌తో సాహో లాంటి ప్రెస్టేజియ‌స్ సినిమాను తెర‌కెక్కించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. తొలి సినిమాలో బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాల‌ను న‌మ్ముకుని బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చినా… రెండో సినిమా విష‌యంలో ప్ర‌భాస్ లాంటి క్రేజీ హీరో, ఏకంగా రూ.350 కోట్ల బ‌డ్జెట్ ఉన్నా ఆశించిన అవుట్ ఫుట్ ఇవ్వ‌లేక‌పోయాడు.

భ‌యంక‌ర‌మైన ప్లాప్ టాక్‌తో కూడా సాహో ఐదురోజులకి 350 కోట్లు రాబ‌ట్టింది. ఈ సినిమా త‌ర్వాత సుజీత్ నెక్ట్స్ ఎలాంటి సినిమా తీస్తాడు ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. త‌న నెక్ట్స్ సినిమా ఖ‌చ్చితంగా సాహో లాంటి భారీ సినిమాగా ఉండ‌న‌ది చెప్పేశాడు. రాజ‌మౌళి మ‌గ‌ధీర త‌ర్వాత మ‌ర్యాద రామ‌న్న లాంటి చిన్న సినిమా తీశార‌ని… ఇప్పుడు తాను కూడా త‌క్కువ బ‌డ్జెట్లో ఓ చిన్న సినిమా చేస్తాన‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం సాహో హ‌డావిడిలో ఉన్నందున త‌న నెక్ట్స్ సినిమా గురించి ఇంకేమి ఆలోచించ‌లేద‌ని కూడా సుజీత్ చెప్పాడు.

Leave a comment