రామయ్య బాకీ ఉందంటున్న దర్శకుడు

రచయిత నుండి దర్శకుడిగా మారిన దర్శకుడు హరీష్ శంకర్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. షాక్ సినిమాతో డైరెక్షన్ మొదలెట్టిన ఈ దర్శకుడు మిరపకాయ్, గబ్బర్ సింగ్, డీజే వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించి వావ్ అనిపించుకున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడికి ఎంతో ఇష్టమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం కూడా గతంలోనే వచ్చింది.

తారక్‌తో రామయ్య వస్తావయ్యా అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు హరీష్ శంకర్. అయితే ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు హరీష్. కానీ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బిచాణా ఎత్తేయడంతో హరీష్ శంకర్ చాలా అప్‌సెట్ అయ్యాడు. ఆ ఫ్లాప్ దెబ్బ నుండి బయట పడేందుకు చాలా సమయం పట్టినట్లు తెలిపాడు. కాగా ఆ తరువాత హిట్లు వచ్చినా ఏదో తెలియని వెలితి ఉందని చెప్పేవాడు హరీష్. ఇక ఇప్పుడు తన తాజా చిత్రం వాల్మీకితో మనముందుకు రావడానికి రెడీ అయ్యాడు ఈ దర్శకుడు. వరుణ్ తేజ్‌ను పూర్తిగా మాస్ యాంగిల్‌లో చూపిస్తూ మరో బ్లాక్ బస్టర్‌ను ఆశిస్తున్నాడు ఈ డైరెక్టర్. అయితే తారక్‌కు ఓ హిట్ అందించడం బాకీ ఉన్నట్లు చెబుతున్నాడు హరీష్.

ఎప్పటికైనా తనకు ఇష్టమైన తారక్‌తో ఓ అదిరిపోయే బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ దర్శకుడు. మరి హరీష్ కోరికను తారక్ ఎప్పుడు మన్నిస్తాడో అని ఆశగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా తన ఫేవరెట్ హీరోతో మరో సినిమా చేసే ఛాన్స్ కోసం హరీష్ శంకర్ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నాడని సంబుర పడుతున్నారు తారక్ ఫ్యాన్స్.

Leave a comment