సినిమా: బందోబస్త్
నటీనటులు: మోహన్ లాల్, సూర్య, ఆర్య, సయెషా, బొమన్ ఇరానీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎంఎస్ ప్రభు
సంగీతం: హ్యారిస్ జైరాజ్
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: కెవి ఆనంద్
తమిళ స్టార్ హీరో సూర్య, లెజెండ్ యాక్టర్ మోహన్ లాల్, ఆర్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ బందోబస్త్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా అలరించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
భారత ప్రధాని అయిన మోహన్ లాల్‌ను చంపేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతుంటారు. అయితే వారి కుట్ర నుండి మోహన్ లాల్‌ను తప్పించేందుకు అతడి కొడుకు ఆర్య కూడా తెగ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రైతు అయిన సూర్య ప్రధానితో భేటీ అవుతాడు. కట్ చేస్తే.. మోహన్‌లాల్‌ను ఉగ్రవాదుల నుండి కాపాడే బాధ్యత తీసుకుంటాడు సూర్య. ఈ క్రమంలో సయెషా వ్యాపారవేత్త అయిన బొమన్ ఇరానీ రైతుల భూములను స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తాడు. అతడిని ఎదుర్కొనేందుకు సూర్య ఏం చేశాడు..? ఉగ్రవాదుల నుండి మోహన్ లాల్ తప్పించుకుంటాడా? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన బందోబస్త్ సినిమాలో భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్టాఫ్‌లో ప్రధానమంత్రి పై జరిగే హత్యాకుట్రలు, వాటి నుండి ఆయనను తప్పించేందుకు ఆయన కొడుకు ఆర్య, రైతు సూర్య చేసిన ప్రయత్నాలు మనకు చూపించాడు దర్శకుడు. ఈ క్రమంలో సయెషాపై జరిగిన ఓ అటాక్‌లో సముత్తికరన్ చనిపోవడంతో సూర్య ఆ అటాక్ చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు.
ఇక సెకండాఫ్‌లో వ్యాపారవేత్త బొమన్ ఇరానీ నుండి రైతులు భూమిని ఎలా కాపాడుకున్నారనే అంశం చూపించారు. అటు మోహన్ లాల్‌పై జరుగుతున్న మర్డర్ ప్లాన్‌లను సూర్య ఎలా తిప్పికొడతాడు.. చివరకు వారిని సూర్య ఏం చేస్తాడనే అంశంతో సినిమాను ముగించాడు దర్శకుడు కెవి ఆనంద్.
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బీ,సీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉన్నప్పటికీ తెలుగు జనాలకు పెద్దగా నచ్చకపోవచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమాను సూర్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు.
నటీనటుల పర్ఫార్మెన్స్:
ప్రధాన మంత్రి పాత్రలో మోహన్ లాల్ యాక్టింగ్ బాగుంది. ఆయన కొడుకుగా ఆర్య చాలా సింపుల్ పాత్రలో నటించినా ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సినిమా మొత్తాన్ని తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సూర్య. రైతు నుంచి ప్రధాన మంత్రి సెక్యురిటీ ఆఫీసర్‌గా సూర్య చూపించిన పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది. హీరోయిన్‌గా సయెషా పర్వాలేదనిపించింది. ముఖ్య పాత్రలో నటించిన సముత్తికరణ్ యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా నటీనటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు కెవి ఆనంద్ తెరకెక్కించిన బందోబస్త్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోవచ్చు. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా యాక్షన్ డోస్ ఎక్కువైపోయింది. ఇంతమంది స్టార్స్‌ను వాడుకున్న దర్శకుడు వారిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. హ్యారిస్ జయరాజ్ సంగీతం సినిమాకు మంచి బలం చేకూర్చింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో వచ్చే బీజీఎం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ఉపయోగపడింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
బందోబస్త్ – ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్
రేటింగ్:
2.5/5.0