Moviesడియర్ కామ్రేడ్ రివ్యూ & రేటింగ్

డియర్ కామ్రేడ్ రివ్యూ & రేటింగ్

సినిమా: డియర్ కామ్రేడ్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన, శృతి రామచంద్రన్ తదితరులు
సనిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం: జస్టిన్ ప్రభాకరణ్
నిర్మాత: యష్ రంగినేని
దర్శకత్వం: భరత్ కమ్మ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ రష్మిక మందన నటించిన మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్‌తో ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న డియర్ కామ్రేడ్ చిత్రం ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
చైతన్య బాబీ కృష్ణణ్(విజయ్ దేవరకొండ) అభ్యుదయ భావాలు గల వ్యక్తిగా ఉంటాడు. అతడికి కోపం చాలా ఎక్కువ. కట్ చేస్తే అతడి ఫ్లాష్‌బ్యాక్‌లో కాలేజీ లైఫ్‌ను గుర్తుచేసుకుంటాడు. కాలేజీలో కోపం ఎక్కువగా ఉండే నాయకుడిగా బాబీ ఉంటాడు. ఒక లోకల్ గ్యాంగ్‌తో బాబీ గొడవకు దిగుతాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన లిల్లీ(రష్మిక)ను అతడు కలుస్తాడు. వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. కొన్ని కారణాల వల్ల వారిరువురు దూరం అవుతారు. కట్ చేస్తే.. లిల్లీ ఒక క్రికెట్ ప్లేయర్ అని బాబీకి తెలుస్తోంది. హైదరాబాద్‌లో కలుసుకున్న వీరిద్దరు కొన్ని కారణాల వల్ల విడిపోతారు.

శాంతిని వెతుక్కుంటూ చైతన్య ఇండియా మొత్తం తిరుగుతాడు. కాగా రష్మికకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం బాబీకి తెలుస్తోంది. దీంతో రష్మిక ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమెకు బాబీ సాయం చేస్తాడు. గతంలో రష్మికకు జరిగిన కొన్ని సంఘటనల గురించి బాబీకి తెలుస్తోంది. ఇక క్రికెట్ ప్లేయర్ అయిన లిల్లీకి, క్రికెట్ బోర్డుకు మధ్య నడిచే వివాదాన్ని బాబీ ఏ విధంగా పరిష్కరిస్తాడు..? లిల్లీకి గతంతో ఏం జరిగింది..? బాబీ, లిల్లీల ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది సినిమా కథ.

విశ్లేషణ:
ఒక ఔట్ అండ్ ఔట్ ఎమోషనల్ యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమా మందు నుండి చెప్పినట్లుగానే యూత్‌ను ఆకట్టుకుంటుంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కమ్యునిస్ట్ ఆలోచనలు ఉన్న స్టూడెంట్ లీడర్‌గా విజయ్ దేవరకొండ చాలా అగ్రెసివ్‌గా నటించాడు. అతడి కోపం కారణంగా కొన్ని గొడవలు కూడా జరుగుతాయి.ఈ క్రమంలో ఫ్యామిలీ ఫ్రెండ్ లిల్లీని అతడు కలిసిన విధానం చాలా సాదాసీదాగా చూపించాడు దర్శకుడు. వారి మధ్య ఏర్పడిన బంధం.. ఇంతలోనే బ్రేకప్‌కు దారి తీయడంతో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ వస్తోంది. ఫస్టాఫ్‌లో బాబీ, లిల్లీల పాత్రలు, వాటిని ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులను అలరిస్తాయి.

ఇక సెకండాఫ్‌లో లిల్లీకి జరిగిన ఒక సంఘటన కారణంగా ఆమె ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్న బాబీ.. వాటి నుండి ఆమెను బయటపడేసే సన్నివేశాలను బాగా చూపించారు. ఈ క్రమంలో క్రికెట్ పట్ల లిల్లీకి ఉన్న ఆసక్తి.. ఆమెను తన లక్ష్యాన్ని చేరుకునేందుకు బాబీ చేసిన ప్రయత్నం కలగలిసి చిత్రాన్ని క్లైమాక్స్‌కు తీసుకువస్తాయి. ఇక కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో సినిమాను ముగించిన తీరు బాగుంది. అయితే సెకండాఫ్‌‌లో సినిమాను కాస్త ల్యాగ్ చేసినట్లు కనిపిస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే.. బాబీ, లిల్లీల మధ్య నడిచే కథను విజయ్ దేవరకొండ నైజంకు తగ్గట్టుగా తెరకెక్కించిన దర్శకుడు బాబీ.. ఈ సినిమాను యూత్‌ను టార్గెట్‌గా చేసుకుని తెరకెక్కించాడు. ఇక ఆయా పాత్రల్లో వారిద్దరు నటించిన తీరు యూత్‌కు బాగా నచ్చుతుంది. ఏదేమైనా డియర్ కామ్రేడ్ చిత్రంపై మొదట్నుండీ ఏర్పడిన అంచనాలను ఈ సినిమా అందుకుందనే చెప్పాలి.

నటీనటులు పర్ఫార్మెన్స్:
బాబీగా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. అభ్యుదయ భావాలు కలిగిన యువకుడిగా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ పీక్స్. ఇక అతడు చూపించిన మెచ్యూ్ర్డ్ యాక్టింగ్ సినిమాపై ఆడియెన్స్‌లలో ఒక వేవ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లిల్లీ పాత్ర గురింది. లిల్లీ పాత్ర కోసం రష్మిక పడ్డ కష్టం మనకు స్పష్టంగా తెరపై కనిపిస్తోంది. రొమాన్స్, ఎమోషన్ ఇలాంటి అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌తో రష్మిక నటన చాలా బాగుంది. గత చిత్రాలతో పోలిస్తే అమ్మడు ఈ సినిమాలో డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. మిగతా నటీనటులు వారి పాత్రల మేర బాగా చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడిగా తొలి చిత్రంతోనే మంచి ప్రతిభ కనబర్చాడు దర్శకుడు భరత్ కమ్మ. ఒక సింపుల్ కథను తాను అనుకున్న విధంగా తెరకెక్కించి మెప్పించాడు దర్శకుడు. ఒక చక్కటి ప్రేమకథకు అన్ని రకాల అంశాలను జోడించి ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనర్‌గా చూపించాడు. నటీనటులతో అతడు రాబట్టిన పర్ఫార్మెన్స్ అతడి సత్తాను మనకు చెబుతాయి. ఇక సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. సుజిత్ సారంగ్ టేకింగ్ ఈ సినిమాను ఎక్కడా ట్రాక్ తప్పకుండా చేస్తుంది. అటు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్. కొన్ని పాటలు, కొన్ని చోట్ల వచ్చిన బీజీఎం సినిమాకు బాగా తోడయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పనితీరు ఇంకాస్త బాగుండాల్సింది.

చివరగా:
డియర్ కామ్రేడ్: ఇంటెన్స్‌తో కూడిన లవ్ స్టోరి!

రేటింగ్:
3.25/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news