సినిమా: బ్రోచేవారెవరురా
నటీనటులు: శ్రీవిష్ణు, సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేథా థామస్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
నిర్మాత: విజయ్ కుమార్ మన్యన్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
చిన్న సినిమాగా తెరకెక్కిన ‘బ్రోచేవారెవరురా’ ప్రస్తుతం టాలీవుడ్ చూపును తనవైపు తిప్పుకుంది. క్రైం కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు జనాలను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
దర్శకుడు కావాలనుకునే విశాల్(సత్యదేవ్) షాలిని(నివేథా పూజ)కు ఓ కథను వినిపిస్తాడు. ఈ కథ మిత్రా(నివేథా థామస్) అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమెతో పాటు చదువుకునే రాహుల్(శ్రీవిష్ణు), రాకీ(ప్రియదర్శి), రాంబో(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు స్నేహితులు R3 గ్యాంగ్‌గా పిలువబడతారు. వారితో మిత్రా కూడా స్నేహం చేస్తుంది. మిత్రాను ఇష్టపడే రాహుల్ ఆమెను కుటుంబ సమస్యల నుండి బయట పడేసేందుకు సహాయం చేస్తాడు. ఈ క్రమంలో ఓ కిడ్నాప్ కేసులో వీరంతా ఇరుక్కుంటారు. ఇంతకీ కిడ్నాప్ ఎవరు అయ్యారు..? కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు..? ఈ క్రైంతో R3 గ్యాంగ్‌కు లింకేంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు వివేక్ ఆత్రేయ తీసుకున్న క్రైం కామెడీ కథ సాధారణమే అయినా సినిమాను ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ముగ్గురు స్నేహితులు, వారితోపాటు ఓ అమ్మాయి.. వీరి జీవితంలో వచ్చే కష్టాలను వాళ్లు ఎలా పరిష్కరించుకున్నారు అనే కథను కొన్ని కామెడీ సీన్స్‌తో కలిపి దర్శకుడు ప్రెజెంట్ చేసిన విధానం సదరు ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌లో స్నేహితుల మధ్య నడిచే సీన్స్.. మిత్రాను వారు కుటుంబ సమస్యల నుండి బయటకు పడేసే అంశాలను చూపించాడు. ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.
ఇక సెకండాఫ్‌లో వీరంతా ఓ క్రైంలో ఇరుక్కుంటారు. కిడ్నాప్ కేసులో వీరి ప్రమేయం ఏమిటనే విషయాన్ని మనకు దర్శకుడు చూపించాడు. ఈ క్రమంలో వచ్చే కొత్త పాత్రలు.. కథతో పాటు సాగే కామెడీ కలగలిసి చిత్రాన్ని క్లైమాక్స్‌కు తీసుకెళ్తాయి. ఇక క్లైమాక్స్‌ను ముగించిన విధానం కూడా బాగుండటంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది.
ఓవరాల్‌గా ఈ సినిమా ఫస్టాఫ్‌లో కామెడీతో, సెకండాఫ్ క్రైం కామెడీతో ప్రేక్షకుడిని కట్టిపడేయాలని చూసిన దర్శకుడు, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. ఇక ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉన్నా మెయిన్ లీడ్ నటులు వారి నటనతో ప్రేక్షకులను మెప్పించారు. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నివేథా థామస్, సత్యదేవ్ తమ నేచరుల్ యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను కట్టిపడేశారు. కామెడీ సీన్స్‌లో వీరి యాక్టింగ్ సూపర్. మిగతా వారు తమ పరిధిమేర బాగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు వివేక్ ఆత్రేయ రాసుకున్న కథను తాను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. ఓ చిన్న స్టోరీలైన్‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో ఈ దర్శకుడు ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేశాడు. నటీనటుల నుండి తాను అనుకున్నది రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాకు మరో మేజర్ అసెట్ సినిమాటోగ్రఫీ. ప్రతీ సీన్ బాగా చూపించారు. కథతో పాటు మనల్ని ఇంప్రెస్ చేసే మరో అంశం సంగీతం. కొన్ని సీన్స్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
బ్రోచేవారెవరురా – ఇది నచ్చని వారు ఎవరురా..!
రేటింగ్:
3.0/5.0