చిత్రం: మహర్షి
నటీనటులు: మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, తదితరులు
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాతలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: కె.యు. మోహనన్
విడుదల తేదీ: 9-05-2019
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురుచూశారు ఆడియెన్స్. ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో దిగింది. మహేష్ బాబు ల్యాండ్‌మార్క్ 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి చిత్రంపై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడం గ్యారెంటీ అని సినీ వర్గాలు ఫిక్స్ అయ్యారు. మరి నేడు రిలీజ్ అయిన మహర్షి ప్రేక్షకుల అంచనాలు ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
అమెరికాలో ఒరిజిన్ కంపెనీ సీఈఓ రిషి(మహష్) ఓటమి అంటే తెలియకుండా సక్సెస్‌ను తన చిరునామాగా మార్చుకుని దూసుకెళుతుంటాడు. ఈ క్రమంలో తన కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకుంటాడు రిషి. వైజాగ్‌లో కాలేజీలో చదివే రిషి అందులో కొత్తగా చేరిన రవి(అల్లరి నరేష్)ను సరదాగా ఆటపట్టిస్తాడు. దీంతో వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. వీరిద్దిరతో పాటు పూజా కూడా అదే కాలేజీలో చదువుతుండటంతో ఆమెతో కూడా రిషి స్నేహం చేస్తాడు.
కట్ చేస్తే కాలేజీ ముగిసిన తరువాత రిషి ఇంట్లో వారితో గొడవపడి మరీ అమెరికాలో ల్యాండ్ అయ్యి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఇక రవి గురించి కొన్ని నిజాలు తెలుసుకున్న రిషి, తన సీఈఓ పదవిని కాదని ఇండియాకు తిరిగి వస్తాడు. సినిమా గోదావరి జిల్లాలోని రామవరంకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ రవి రైతుల తరఫున పోరాటం చేస్తుంటాడు. ట్రిడెంట్ గ్రూప్ అనే సంస్థకు ఓనర్ అయిన వివేక్ మిట్టల్(జగపతి బాబు) ఆ గ్రామంలోని పొలాల నుంచి తన కంపెనీ గ్యాస్ పైపులైన్ వేయాలని ప్రయత్నిస్తుంటాడు. దీంతో రిషి రంగంలోకి దిగి రైతులకు అండగా నిలుస్తాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రజలకు తెలియజేస్తాడు.
రామవరం రైతులకు రిషి ఎలా సహాయం చేస్తాడు..? రవికి ఏమౌతుంది? పూజాను రిషి పెళ్లి చేసుకుంటాడా? అనే విషయాలు తెలియాలంటే మహర్షి సినిమాను చూసి తీరాల్సిందే.
విశ్లేషణ:
మహర్షి ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా మహేష్ కెరీర్‌లో నిలిచింది. శ్రీమంతుడు, భరత్ అనే నేను తరహాలో మహర్షి సినిమాలో కూడా మహేష్ ఒక మంచి సామాజిక అంశాన్ని లేవనెత్తాడు. రైతులు పడుతున్న కష్టం, వారి పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు మహేష్. సినిమా కథ పూర్తిగా ఎమోషనల్‌తో మిక్స్ చేస్తూ నేటి తరం జనాలకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు.
ఫస్టాఫ్‌లో సీఈఓ రిషిగా మహేష్ ఎంట్రీ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆపై ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లో సరికొత్త గెటప్‌లో మహేష్ దర్శనమివ్వడంతో ఆడియెన్స్ చాలా థ్రిల్ అయ్యారు. అమాయకుడైన రవి పాత్రలో అల్లరి నరేష్ మంచి నటనను కనబర్చాడు. కాలేజీ కుర్రాడిగా మహేష్ తాను ప్రపంచాన్ని సాధించాలనుకునే విధానం.. దానికోసం సొంత తల్లిదండ్రులను ఎదురించడం సాధారణ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది. సీఈఓగా సక్సెస్ అయిన రిషికి ఒక షాకింగ్ విషయం తెలియడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. ఓవరాల్‌గా ఫ్రెండ్‌షిప్, కెరీర్ గోల్‌ను సెట్ చేసుకునే రిషి దాన్ని సాధించిన విధానం బాగా చూపించాడు దర్శకుడు.
ఇక సెకండాఫ్‌లో రవి చేస్తున్న పోరాటం గురించి తెలుసుకుని వాళ్ల ఊరికి వెళతాడు రిషి. అక్కడ రవికి తోడుగా ఉంటూ రైతుల కోసం తానూ పోరాటం చేస్తాడు. ఈ క్రమంలో రైతుల కష్టాన్ని దగ్గర్నుంచి చూసిన రిషి వారికి ఏదో ఒక సాయం చేయాలని చూస్తాడు. అయితే రైతులు కోరుకునేది జాలి కాదని.. గౌరవం అని తెలుసుకున్న రిషి, వారిని ఇబ్బంది పెడుతున్న ట్రిడెంట్ కంపెనీ ఓనర్ వివేక్ మిట్టల్‌పై యుద్ధానికి దిగుతాడు. అతడి బారి నుంచి రామవరం గ్రామ రైతులను రిషి ఎలా కాపాడనేది సినిమా కథగా చూపించాడు దర్శకుడు.
ఓవరాల్‌గా చూస్తే ఒక సింపుల్ కథను తాను రాసుకున్న పరిధి మేర బాగా చూపించాడు దర్శకడు వంశీ పైడిపల్లి. మహర్షి ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. మహేష్ ల్యాండ్‌మార్క్ మూవీ కావడంతో ఎలాంటి ప్రయోగాలు లేకుండా ఒక సాధారణ కథతో మనముందుకు వచ్చిన మహేష్ మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
నటీనటుల పర్ఫార్మెన్స్:
మహర్షి సినిమాలో మహేష్ వన్ మ్యాన్ షో కనిపిస్తుంది. కంపెనీ సీఈఓగా, కాలేజీ స్టూడెంట్‌గా రిషి పాత్రలో మహేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్‌నో మహేష్ యాక్టింగ్ పీక్స్. ఇక కాలేజీ కుర్రాడిగా సరికొత్త లుక్‌తో ఆడియెన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు మన సూపర్ స్టార్. అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో ఆడియెన్స్‌ను కట్టిపడేశాడు. హీరోయిన్ పూజా హెగ్డేకు అంతగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించనప్పటికీ తన మార్క్ యాక్టింగ్‌తో పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు తమ పరిధిమేర బాగానే నటించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
మహర్షి సినిమా కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి పడ్డ కష్టం మనకు సినిమా చూస్తే అర్ధం అవుతుంది. సాధారణ కథను తాను రాసుకున్న విధంగా తెరకెక్కించడంలో వంశీ సక్సెస్ అయ్యాడు. సినిమాకు కథే హీరో కావడంతో దాన్ని ఎక్కడా పక్కదారి పట్టించకుండా జాగ్రత్త పడ్డాడు వంశీ. రైతుల కష్టాలను తెలుసుకున్న ఓ కోటీశ్వరుడు సామాన్యుడిగా చేసిన పోరాటాన్ని అద్భుతంగా చూపించాడు. ఇక సినిమాకు మరో మేజర్ అసెట్ సంగీతం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఒక ఎత్తయితే.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. ఎమోషనల్ సీన్స్‌లో వచ్చే బీజీఎం అదిరిపోయింది. మోహనన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలైట్. ప్రతి సీన్‌ను చాలా గ్రాండ్‌గా చూపించాడు. ఈ సినిమాను ముగ్గురు బడా నిర్మాతలు ప్రొడ్యూస్ చేయడంతో సినిమా చాలా రిచ్‌గా కనిపించింది.
చివరిగా:
మహర్షి – మహేష్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్
రేటింగ్: 3.5/5