సినిమా రంగంలో ‘నందమూరి’ వంశం అంటే ఒక బ్రాండ్. నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే… హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న… ఇలా చాలామంది ఆ వంశం నుంచి వెండితెరపై వెలిగారు. అయితే ఇందులో కొందరు మాత్రమే తమ కెరియర్ గాడిలో పెట్టుకోగా మరికొంతమంది సినీ రంగం నుంచి సరైన అవకాశాలు లేక తారకరత్న వంటివారు దూరం అయిపోయారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరేలా కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్.
ఎందుకంటే కళ్యాణ్ రామ్ సినీ ప్రస్థానం చూసుకుంటే… ఆటుపోట్లతోనే సాగుతోంది. తక్కువ విజయాలు ఎక్కువ అపజయాలు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ‘అతనొక్కడే’.. ‘పటాస్’ మినహాయిస్తే చెప్పుకోతగ్గ హిట్లే లేవు. కొన్నేళ్ల కిందట ‘పటాస్’తో మంచి విజయాన్నందుకుని కెరీర్ ను గాడిన పెట్టుకున్నట్లే కనిపించాడు కానీ.. తర్వాత పరిస్థితి మామూలే. వరుసగా అతను చేసిన సినిమాలన్నీ బాక్సపీస్ వద్ద బోల్తా కొట్టాయి. చివరగా ఈ ఏడాది ‘నా నువ్వే’ లాంటి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా ప్లాప్ సినిమాల ఖాతాలో పడిపోయింది.
‘నా నువ్వే’ సినిమాను కళ్యాణ్ రామ్ వ్యక్తిగత పీఆర్వో కూడా అయిన మహేష్ కోనేరు నిర్మించి ఆర్ధికంగా దెబ్బతిన్నాడు. కానీ కళ్యాణ్ రామ్ మీద అభిమానంతో… మళ్లీ అదే బేనర్ లో ఓ భారీ బడ్జెట్ సినిమా మొదలుపెట్టాడు కళ్యాణ్ రామ్. సీనియర్ సినిమాటోగ్రాఫర్ గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈ సినిమా ఫలితం ఆధారంగా కళ్యాణ్ రామ్ కెరియర్ ఆధారపడి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.