త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కలిసి చేసిన అరవింద సమేత సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా ఈషా రెబ్బ కూడా ఇంపార్టెంట్ రోల్ చేసింది. సునీల్ కూడా సినిమాలో భాగమవగా ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
వీర రాఘవ (ఎన్.టి.ఆర్) సినిమా మొదటినుండి చాల కోపంతో ఉంటాడు. ఒక సందర్భంలో అరవిందని చూసి ఇష్టపడిన వీర రాఘవ ఆమె వెంటే తిరుగుతాడు. ఆమెకు బాడీ గార్డ్ గా ఉంటూ వస్తున్న వీర రాఘవ.. ఆమెను కాపాడే క్రమంలో అసలు తానెవరు అన్నది రివీల్ చేస్తాడు. రాయలసీమ వాడైన వీర రాఘవ సిటీకి ఎందుకొచ్చాడు. వీర రాఘవ అసలు విశ్వరూపం ఏంటి.. అది ఎలా బయటపెట్టాడు. శత్రువులను వీర రాఘవ ఎలా మట్టుపెట్టాడు.. యుద్ధం తర్వాత శత్రువులు ఎలా మిగిలారు. వారి కథని వీర రాఘవ ఎలా ముగించాడు అన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వీర రాఘవ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. సినిమా అంతా తారక్ తన భుజాన వేసుకుని నడిపించాడు. త్రివిక్రం పెన్ పవర్ కు ఎన్.టి.ఆర్ నటన తోడైతే ఎలా ఉంటుందో దానికి తగినట్టుగా సినిమా ఉంది. ఇక హీరోయిన్ పూజా హెగ్దె కూడా మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. సినిమాలో మరో హీరోయిన్ ఈషా రెబ్బ కూడా అలరించింది. సునీల్ చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీతో మెప్పించాడు. సినిమాలో సునీల్ పాత్ర బాగుంది. జగపతి బాబు విలనిజం గూస్ బమ్స్ తెప్పిస్తుంది. ఏ పాత్రనైనా అలవోకగా చేయడంలో తనకు సాటే అనిపించాడు జేబి. ఇక నవీన్ చంద్ర కూడా విలన్ కొడుకు పాత్రలో మెప్పించాడు.
సాంకేతికవర్గం పనితీరు :
పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ అదిరిపోయింది. కథకు తగినట్టుగా కెమెరా వర్క్ బాగుంది. తమన్ మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచింది. రెండు పాటలు సోసోగా ఉన్నా పెనివిటి, అనగనగనగా సాంగ్స్ అలరించాయి. సిచ్యువేషన్ గా సాంగ్స్ వర్క్ అవుట్ అయ్యాయి. ఇక కథ, కథనాల్లో దర్శకుడు త్రివిక్రం మళ్లీ తన ఫాం లోకి వచ్చాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు.
విశ్లేషణ :
యుద్ధం గెలవడం కాదు.. యుద్ధం ఆపేయడం ముఖ్యం.. యుద్ధం చేశాక గెలిచిన వాడు.. ఓడిన వాడి పరిస్థితి ఏంటి.. ఇలాంటి అంశాలన్ని ప్రస్థావిస్తూ రాసుకున్న కథ అరవింద సమేత. టైటిల్ తోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పాడు త్రివిక్రం. ఎన్.టి.ఆర్ తల్లి పాత్రతో పాటుగా అరవింద పాత్రతో తానేం చేయాలో తెలుసుకుంటాడు వీర రాఘవ.
సినిమా కథ చాలా గొప్పగా రాసుకున్నాడు త్రివిక్రం. కథ చెప్పడానికి చాలా సింపుల్ గా అనిపించినా దాన్ని కన్విన్స్ చేసేందుకు ఆయన ఎంచుకున్న కథనం అదిరిపోయింది. ముఖ్యంగా సినిమాలో పాత్రలన్ని ఏదో వచ్చి వెళ్తున్నాయ్ అన్నట్టుగా కాకుండా కథకు అవసరమయ్యేట్టుగా రాసుకున్నాడు. ఇక డైలాగుల విషయంలో అయితే త్రివిక్రం పెన్ పవర్ ఏంటో చూపించాడు.
కథ, కథనాలే కాదు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ హంగులతో అరవింద సమేత వచ్చింది. తప్పకుండా ఎన్.టి.ఆర్ కెరియర్ లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎమోషనల్, సెంటిమెంటల్ మూవీగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చూడదగిన సినిమా ఇది.
ప్లస్ పాయింట్స్ :
ఎన్.టి.ఆర్ నటన
త్రివిక్రం డైలాగ్స్
బిజిఎం
మైనస్ పాయింట్స్ :
పెద్దగా ఏమి లేవు
బాటం లైన్ :
అరవింద సమేత వీర రాఘవ.. త్రివిక్రం, తారక్ అంచనాలకు తగిన సినిమా..!
రేటింగ్ : 3.5/5