ఏపీ ప్రభుత్వం ఇటీవల మూడు సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. నంది అవార్డుల్లో మెగా హీరోలకు స్థానం దక్కకపోవడంతో పాటు, వారు నటించిన సినిమాలను కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా ఈ విషయమై అల్లు అర్జున్‌కు సన్నిహితుడు అయిన బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఏపీ ప్రభుత్వం నుండి మెగా హీరోలు నటన నేర్చుకోవాలని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. ఆ విషయమై చర్చించేందుకు ఒక న్యూస్ ఛానెల్ అవార్డు జ్యూరీ సభ్యులను మరియు సినీ ప్రముఖులతో చర్చ పెట్టింది. చర్చలో భాగంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం జరిగిందని, మెగా ఫ్యామిలీని కావాలని ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని అన్నాడు.
ఇవి నంది అవార్డులు కావని, ఇవి సైకిల్ అవార్డులు అంటూ బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ప్రభుత్వం పూర్తిగా వారికి అనుకూలమైన వారికి మాత్రమే అవార్డులను ఇచ్చింది అంటూ బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను నిర్మించిన గోవిందుడు అందరి వాడేలే చిత్రానికి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ఎంపిక చేస్తారని భావించాను అని, రామ్ చరణ్‌కు ఉత్తమ హీరోగా అవార్డు వస్తుందని ఆశించాను అని, కాని ప్రభుత్వం తమ వారికి అవార్డులను కట్టబెట్టింది అంటూ అసహనం వ్యక్తం చేశాడు. బండ్ల గణేష్ వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు.