సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు..ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం క్రిష్ దర్శకత్వంలో తన 100వ సినిమా గౌతమి పుత్రశాతకర్ణిలో నటించారు.
ఇక బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి.. కానీ జరగలేదు. తాజాగా మోక్షజ్ఞ తెరంగేట్రం చేయనున్నాడని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తెలిపారు. 1991 లో వచ్చిన ఆదిత్య 369 బాలకృష్ణకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు.
అయితే ఆదిత్య 369కి సీక్వెల్ తీయబోతున్నారట.. ఇప్పటికే స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నారట సింగీతం. ఇందులో మోక్షజ్ఞ నటించే అంశంపై బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించాల్సి ఉందన్నారు. ఇక సీక్వెల్ లో బాలకృష్ణకూ ప్రామినెంట్ రోల్ ఉన్నా లీడ్ రోల్ మోక్షజ్ఞదేనని స్పష్టం చేశారు. బాలయ్య ఓకే చెప్పగానే షూటింగ్ ప్రారంభమవుతుందని.. నటీనటుల గురించి త్వరలో స్పష్టం చేస్తామని చెప్పారు.