Movies‘శతమానం భవతి’ ప్రీమియర్-రివ్యూ.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే కుటుంబ కథాచిత్రం

‘శతమానం భవతి’ ప్రీమియర్-రివ్యూ.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే కుటుంబ కథాచిత్రం

Exclusive premiere review of shatamanam bhavati movie. Vegeshna Satish directed this movie under Dil Raju production. Sharwanand and Anupama Parameswaran played main lead roles.

సినిమా : శతమానం భవతి
నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ, తదితరులు
దర్శకుడు : వేగేశ్న సతీష్
నిర్మాత : దిల్‌రాజు
సంగీతం : మిక్కీ జే.మేయర్

వరుస సినిమాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం ‘శతమానం భవతి’. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. దిల్‌రాజు మంచి బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. పైగా.. ఆయన ఈ చిత్రాన్ని ఎంతో నమ్మకంగా రెండు భారీ సినిమాల పోటీ మధ్య రిలీజ్ చేస్తుండడంతో, దీనికి మరింత క్రేజ్ వచ్చింది. మరి.. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? వేచి చూడాల్సిందే.

కథ :
రాజుగారు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉంటారు. వీళ్లంతా విదేశాల్లోనే స్థిరపడితే.. ఆ దంపతులు తమ మనవడు రాజు (శర్వానంద్)తో తమ సొంతూరులోనే ఉంటారు. అంతా సవ్యంగానే సాగుతుంటుంది కానీ.. విదేశాల్లో ఉన్న పిల్లలు తమని చూడ్డానికి చాలాకాలం నుంచి రాకపోవడంతో రాజుగారు కలత చెందుతుంటారు. దీంతో.. సంక్రాంతికి వాళ్లని ఎలాగైనా రప్పించాలనే ఉద్దేశంతో రాజుగారు ఒక పథకం వేస్తారు. అది వర్కౌట్ అవ్వడంతో.. అందరూ విదేశాల నుంచి వస్తారు.

అలా విదేశాల నుంచి వచ్చిన రాజుగారు మనవరాలు నిత్య (అనుపమ పరమేశ్వరన్)కి రాజుతో పరిచయం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఆమె రాజు ప్రేమలో పడిపోతుంది. వీరి ప్రేమకథ నడుస్తుండగానే.. రాజుగారు తన పిల్లల్ని ఇంటికి రప్పించేందుకు వేసిన ప్లాన్ ఆయన భార్యకు తెలుస్తుంది. దాంతో.. వారిమధ్య గొడవ జరుగుతుంది. అలాగే.. కుటుంబంలోనూ విభేదాలు ఏర్పడుతాయి. ఇంతకీ ఆ పథకం ఏంటి? అసలు ఎందుకు రాజుగారు ఆ ప్లాన్ వేశారు? దానివల్ల వచ్చిన సమస్యలేంటి? రాజు, నిత్యల ప్రేమకథ ఏమైంది? అన్న అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
ఇది పూర్తిగా ఓ కుటుంబ కథాచిత్రం. అనవసరమైన సన్నివేశాలు ఏమి ఇరికించుకుండా.. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆస్వాదించేలా చక్కగా తెరకెక్కించారు. పెద్దగా ట్విస్ట్‌లేమి లేకుండా.. ఆద్యంతం ఎమోషన్స్‌తో కట్టిపడేసేలా సీన్లు రాసుకున్నారు. కామెడీ కూడా బాగానే పండింది. నరేష్ చేసిన కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించినా.. ఆ తర్వాత వచ్చే సీన్ దాన్ని మరిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా సరదాగా, హీరోహీరోయిన్ల ప్రేమకథతో సాగిపోతే.. సెకండాఫ్‌ చాలావరకు ఎమోషనల్‌గా సాగిపోతుంది. ముఖ్యంగా.. క్లైమాక్స్‌లో కుటుంబ విలువల గురించి చెప్పే సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఓవరాల్‌గా.. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

నటీనటుల పనితీరు :
శర్వానంద్ ఎప్పటిలాగే తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి, చాలా బాగా నటించాడు. కథానాయికగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన అనుపమ.. ఈ చిత్రంలో అద్భుత అభినయం కనబరిచింది. గత సినిమాలతో పోల్చుకుంటే.. మరో మెట్టు ఎక్కింది. శర్వా, అనుపమ పెయిర్ ముచ్చటగా ఉంది. ప్రకాష్ రాజ్, జయసుధలు తమ స్థాయికి తగ్గ నటనతో ఆకట్టుకున్నారు. నరేష్, ఇంద్రజ ఇలా మిగతా తారాగణమంతా తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక పనితీరు :
సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించిన ఆయన కెమెరా పనితనాన్ని మెచ్చుకోవచ్చు. మిక్కీ జే.మేయర్ అందించిన పాటలన్నీ మూడ్‌కు తగ్గట్టు బాగున్నాయి. ఎడిటింగ్, దిల్‌రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ బాగున్నాయి. ఇక డైరెక్టర్ వేగేశ్న విషయానికొస్తే.. అతికిపోకుండా చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు. చిన్న ట్విస్ట్‌తోనే కథను బాగానే నడిపించాడు. ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని అందించడంలో మంచి విజయం సాధించాడు.

ఫైనల్ వర్డ్ : ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తూ…

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news