Delhi residence Vinod Sharma who is 93 kilos weight has paid 78 thousand rupees to a clinic for giving him treatement for month. But when result came he knows that clinic cheated him.
ప్రస్తుత కాలానికి అనుగుణంగా లావుగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకుని, స్లిమ్‌గా తయారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. భారీమొత్తంలో డబ్బులు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇలాంటివారినే టార్గెట్ చేసిన కొందరు దుండగులు.. ఎక్కువమొత్తంలో ఫీజు కడితే తక్కువ రోజుల్లో బరువు తగ్గిస్తామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
ఆ ప్రచారంలో ఎంతవరకు నిజముందో పట్టించుకోకుండా.. స్థూలకాయులు గుడ్డిగా నమ్మి, వేలకు వేలు డబ్బులు సమర్పించుకుంటున్నారు. ఇలాగే ఒక వ్యక్తి ఓ క్లినిక్ చేతిలో నిండా మునిగిపోయాడు. ఆ క్లినిక్ చేసిన ప్రకటన చూసి.. బరువు త్వరగా తగ్గొచ్చునన్న ఆశతో ఎక్కువ మొత్తంలో ఫీజు చెల్లించాడు. తీరా తాను మోసపోయానని తెలుసుకుని సదరు క్లినిక్‌పై ఫిర్యాదు చేశాడు. ఇప్పుడా క్లినిక్ నిర్వాహకులు తాము చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన వినోద్ శర్మ 93.5 కేజీల బరువు ఉన్నాడు. బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ.. ప్రయోజనం లేకుండా పోయింది. ఎలాగైనా బరువు తగ్గాలన్న ఉద్దేశంతో.. అతడు ఓ క్లినిక్‌ని సంప్రదించాడు. నెల రోజుల్లో పది కిలోల బరువు తగ్గిస్తామని, అందుకు రూ.78 వేలు ఫీజు చెల్లించాలని క్లినిక్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. బరువు తగ్గొచ్చన్న ఆశతో.. అంతమొత్తం డబ్బులు ఇచ్చేందుకు వినోద్ అంగీకరించాడు.
డీల్ మొత్తం కుదిరిన తర్వాత.. 2013 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 15 వరకు అతనికి ఆ క్లినిక్‌వారు ట్రీట్‌మెంట్ అందించారు. నెలరోజులు అయ్యాక వినోద్ తన బరువు చూసుకోగా.. కేవలం వంద గ్రాములు మాత్రమే తగ్గినట్లు గుర్తించాడు. దీంతో.. తాను మోసపోయానని గ్రహించిన వినోద్.. వెంటనే జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపి.. ఆ క్లినిక్ నిర్వాహకులకు భారీ జరిమానా విధించింది.
ట్రీట్‌మెంట్ పేరిట వినోద్ శర్మ వద్ద నుంచి తీసుకున్నరూ.78 వేలు తిరిగి ఇవ్వడంతోపాటు రూ.25,000 పరిహారంగా చెల్లించాలని కన్స్యూమర్ ఫోరమ్ ఆదేశించింది. గత్యంతరం లేక ఆ క్లినిక్‌వాళ్లు వినోద్ శర్మకు జరిమానా కట్టారు.