Reviewsరామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామీల ‘ధృవ’ మూవీ...

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామీల ‘ధృవ’ మూవీ రివ్యూ, రేటింగ్

Here is the exlusive review of Ram Charan’s latest movie Dhruva which hits the theatres today. Coming to the point, Charan has selected a fine script which apt to him and to build his career.

సినిమా : ధృవ
నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామీ, నవదీప్, తదితరులు
దర్శకుడు : సురేందర్ రెడ్డి
నిర్మాత : అల్లుఅరవింద్, ఎన్వీ ప్రసాద్
మ్యూజిక్ : హిప్‌హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్
ఎడిటర్ : నవీన్ నూలి
బ్యానర్ : గీతా ఆర్ట్స్
సెన్సార్ సర్టిఫికెట్ : యూ/ఏ
రన్‌టైం : 165 నిముషాలు
రిలీజ్ డేట్ : 09-12-2016

రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ధృవ’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘తని ఒరువన్’కి రీమేక్ అయిన ఈ మూవీలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ కథానాయికగా నటించగా.. ఒరిజినల్ వెర్షన్‌లో విలన్‌గా నటించిన అరవింద్ స్వామీ, తెలుగులోనూ అదే పాత్ర పోషించాడు. రెండు వరుస పరాజయాల తర్వాత చరణ్ ఈ మూవీ చేయడంతో.. మొదటినుంచే దీనిపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్స్‌తో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? తెలుసుకోవడం కోసం రివ్యూలోకి వెళ్దాం పదండి..

కథ :
ధృవ (రామ్ చరణ్), అతని స్నేహితులు.. ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో ఉండగానే సిటీలో జరుగుతున్న నేరాల్సి ఎవరికీ తెలియకుండా అరికడుతూ ఉంటారు. నేరస్తుల్ని పోలీసులకు పట్టుబడేలా చేస్తుంటారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని మట్టుబెట్టాలనే ఉద్దేశంతో అందరూ నిరంతరం కృషి చేస్తుంటారు. ఓరోజు ధృవ, అతని స్నేహితులకు.. తాము పోలీసులకు పట్టించిన నేరస్తుల్లో ఒకడు సులభంగా తప్పించుకుని, బయట యదేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాడు. దాంతో వాళ్ళందరూ ఖంగుతింటారు. అతను బయటకు ఎలా వచ్చాడు? అదంతా ఎలా జరిగింది? అని అందరూ ఆలోచనలో పడిపోతారు.

అప్పుడు ధృవ.. ఎన్నాళ్లగానో తాను రీసెర్చ్ చేస్తున్న ఒక అంశం గురించి చెప్తాడు. దాన్ని సాల్వ్ చేసి.. ఈ చిన్న చిన్న నేరాలన్నింటికీ కారణమైన పెద్ద క్రిమినల్‌ని పట్టుకోవాలన్నదే తన లక్ష్యమని వెల్లడిస్తాడు. అప్పటినుంచి ఆ క్రిమినల్‌ని వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ధృవకి అనుకోకుండా సిద్ధార్థ అభిమన్యు (అరవింద్ స్వామి) అనే సైంటిస్ట్‌తో గొడవ మొదలవుతుంది. అసలు సిద్దార్థ అభిమన్యు ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? అతనికి, ధృవకి మధ్య గొడవ ఎలా ప్రారంభమైంది? ఆ ఫైట్‌లో ఎవరు, ఎలా గెలిచారు..? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
తెరవెనుక ఉండి నేరాలు చేసే ఓ సైంటిస్ట్‌ని.. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా తెలివిగా పట్టుకోగలిగాడు? అన్నదే ఈ స్టోరీ కథ. ఈ స్టోరీ సాదారణమైనప్పటికీ.. దానికి శక్తివంతమైన కథనం జోడించి, ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం ఎత్తులు, పైఎత్తులతో తీర్చిదిద్ద.. సినిమా చివరివరకు ఆసక్తికరంగా సాగేలా చేశారు. మధ్యమధ్యలో కొన్ని ఎపిసోడ్స్ సాగదీసినట్లు అనిపించినా.. హీరో, విలన్‌ల మధ్య నడిచే మైండ్‌గేమ్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్ర్కీన్‌ప్లే చాలా రీఫ్రెషింగ్‌గా, క్రిస్పీగా ఉండడం కూడా ఈ చిత్రానికి మరో ప్రధాన బలం.

ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. ‘నీ శత్రువుని చూసి నీ కెపాసిటీ ఏంటో అంచనా వేయొచ్చు’ అనే సూత్రాన్ని నమ్మే ధృవ.. ఓ బలమైన శత్రువైన అభిమన్యుని ఎంచుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడన్న అంశాల్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించాడు. తొలి సగభాగం మొత్తం.. ధృవ అతని డెన్‌లోకి ఎలా ప్రవేశించాడన్న సన్నివేశాలతో తీర్చిదిద్దారు. ఇక హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ బాగానే ఉంది. పాటలు కూడా సందర్భానుకూలంగా వచ్చి అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ ఆసక్తికరమైన ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం హీరో, విలన్‌ మధ్య మైండ్‌గేమ్‌తో నడుస్తుంది. విలన్‌ని పట్టుకోవడం కోసం హీరో వేసిన ఎత్తుగడలు ఏంటి? వాటిని తిప్పికొట్టేందుకు అభిమన్యు ఏం చేశాడు? అన్న అంశాలతో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. సినిమాని ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.

సాధారణంగా రీమేక్ సినిమా తీస్తున్నప్పుడు.. ఒరిజినల్‌లోని ఫీల్ మిస్ అవ్వకుండా చూసుకోవడం ముఖ్యం. అటూఇటూ తేడా కొట్టినా.. మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన సురేందర్ రెడ్డి.. ఆ ఫీల్ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్నికొన్ని చోట్ల కథలో మిస్ అయినట్లు అనిపిస్తుంది కానీ.. అరవింద్ స్వామి ఎంటరయ్యాక కథ రసవత్తరంగా మారుతుంది. సినిమా వేగం పుంజుకొంటుంది. చాలా సన్నివేశాలు ‘తని ఒరువన్‌’లో ఉన్నట్టుగానే తీర్చిదిద్దారు.. కానీ తెలుగు ప్రేక్షకులకు అనుకూలంగా వాటిని మల్చడంతో.. ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. ఓవరాల్‌గా చూస్తే.. పోలీస్ ట్రైనింగ్, విలన్ పరిచయం, ఇంటర్వెల్ ట్విస్ట్, భిన్నంగా ఉండే క్లైమాక్స్, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మంచి అనుభూతిని ఇస్తుంది.

నటీనటుల పనితీరు :
రామ్ చరణ్ గురించి మాట్లాడితే.. నటన పరంగా మరో స్థాయికి వెళ్ళాలని చెప్పుకోవచ్చు. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ధృవ అనే పోలీసాఫీసర్ పాత్రలో చాలా బాగా నటించాడు. ఆ పాత్ర కోసం ఎంతోకష్టపడి బిల్డప్ చేసిన ఫిజిక్‌తో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక సిద్ధార్థ్ అభిమన్యుగా నటించిన అరవింద్ స్వామికి ఎన్ని మార్కులు వేసినా తక్కువే. ఆ పాత్రని అతడు తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరేమో అనేంతగా అద్భుత నటన కనబరిచాడు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా, తెలివిగా పలికించడంలో ఆయనకు ఆయనే సాటి. రకుల్ ప్రీత్ ఎప్పట్లానే తన పాత్ర పరిధిమేర చాలా బాగా నటించింది. గ్లామర్ షోతోనూ అదరగొట్టేసింది. ఇతర నటీనటులు తమతమ పాత్రల పరిధి బాగానే నటించారు.

సాంకేతిక పనితీరు :
ఈ మూవీకి పీ.ఎస్.వినోద్‌ అందించిన సినిమాటోగ్రఫీని మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్స్‌లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న ఆయన.. తనదైన ఫ్రేమింగ్, లైటింగ్ వాడుతూ తెలుగు సినిమా స్థాయి పెంచే విజువల్స్ అందించాడు. అతని కెమెరా పనితనానికి ఎన్ని మార్కులు వేసినా తక్కువే. హిప్‌హాప్ తమిళ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీని అభినందించకుండా ఉండలేం. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కు వంక పెట్టడానికి లేదు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి విషయానికి వస్తే.. కథలో పెద్ద మార్పులేవీ చేయకుండా, తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా సీన్స్ మార్చుకొని రాసిన స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. మేకింగ్ పరంగా ఎప్పట్లానే తన బ్రాండ్‌ను మరోసారి చాటుకున్నాడు.

ఫైనల్ వర్డ్ : మైండ్‌గేమ్‌తో ఆకట్టుకున్న ధృవ
‘ధృవ’ మూవీ రేటింగ్ : 3.25/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news