Movies‘నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ మూవీ రివ్యూ, రేటింగ్

‘నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ మూవీ రివ్యూ, రేటింగ్

The review of Hebbah Patel’s latest film Nanna Nenu Boyfriends. In this film hebbah falls in love with three guys and confuse at the end to choose one of them. The rest of the film is all about the problems, consequences and the relations that affect because of her step.

సినిమా : నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్
నటీనటులు : హెబ్బా పటేల్, అశ్విన్, నోయెల్, పార్వతీశం
దర్శకత్వం : భాస్కర్ బండి
నిర్మాత : బెక్కం వేణు గోపాల్
సంగీతం : శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ : ఛోటా కే నాయుడు
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
బ్యానర్ : లక్కీ మీడియా
రిలీజ్ డేట్ : 16-12-2016

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్‌కి ఎప్పుటికీ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణే లభిస్తుంటుంది. అందుకే.. ఆ తరహా సినిమాలు చేయడానికే దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ఈమధ్య ట్రెండ్ కాస్త ఛేంజ్ అయింది కాబట్టి, అందుకు తగ్గట్టుగానే జనాల్ని ఆకర్షించే ఫ్లేవర్ జోడించి మరింత ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా కొత్త దర్శకుడు భాస్కర్ బండి కూడా అదే ప్రయత్నం చేశాడు. ‘నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ అనే ప్రేమకథా చిత్రానికి తండ్రి సెంటిమెంట్ జోడించాడు. దీంతో.. ఈ చిత్రానికి కాస్త క్రేజ్ వచ్చింది. ఇక ట్రైలర్‌కి బాగానే రెస్పాన్స్ రావడంతో.. దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. పైగా.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పించడంతో.. ప్రేక్షకుల నుంచి అటెంక్షన్ దక్కించుకుంది. మరి.. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..

కథ :
పద్మావతి (హెబ్బా పటేల్) అనే అమ్మాయి ఉద్యోగం కోసం హైదరాబాద్ సిటీకి వస్తుంది. ఈమెకి పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోవడం ఇష్టం ఉండదు. తనకిష్టమైన వాడిని ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంది. అలా నిర్ణయం తీసుకున్న ఆమె.. బాయ్‌ఫ్రెండ్ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే పద్మావతికి గోకుల్ (నోయెల్), నాని (అశ్విన్), నమో (పార్వతీశం) అనే ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తుంది. వాళ్లు కూడా పద్మావతిని ప్రాణంగా ప్రేమించి, ఆమె కోసం జీవితంలో అన్నీ వదులుకోవడానికి సిద్దపడతారు. చివరికి ఆ ముగ్గురు ప్రేమికుల్లో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో తెలీక.. పద్మావతి కన్ఫ్యూజన్‌లో పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పద్మావతిని.. ప్రాణానికి ప్రాణంగా పెంచిన ఆమె తండ్రి (రావు రమేష్) ఏం చేశాడు..? తన కూతుర్ని ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు..? ఆ ముగ్గురు అబ్బాయిల్లో పద్మావతి ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది? అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
ఓ అమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించడం అనే పాయింట్ చుట్టూ సాగే ఈ స్టోరీని దర్శకుడు భాస్కర్ బండి బాగానే తెరకెక్కించాడు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా లవ్ ఎలిమెంట్స్‌తోపాటు కామెడీని బాగా జోడించి సినిమాని నడిపించాడు. వీటికితోడు తండ్రి సెంటిమెంట్‌ని ఆడియెన్స్‌కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా చాలా ఎమోషనల్‌గా చూపించాడు. ఈ ఎమోషన్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. కూతురిని అమితంగా ప్రేమించి తండ్రి పాత్రని డిజైన్ చేసిన విధానం, దాన్ని పూర్తిగా కథలో ఇన్వాల్స్ చేసిన తీరు, ఆ పాత్రని పోషించిన రావు రమేష్ నటన ఈ చిత్రానికే హైలైట్‌గా నిలిచాయి.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్‌లాగే నడుస్తుంది. ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌ని పద్మావతి ఎంపిక చేసుకోవడం, వారితో ప్రేమాయణం నడపడం.. సరదాగా సాగిపోతాయి. మధ్యలో జబర్దస్త్ టీం చేసే కామెడీ కూడా బాగానే పండింది. అయితే.. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. రొటీన్ లవ్ స్టోరీస్‌లాగే ఇది కూడా సాగిపోతుంది. మధ్యలో వచ్చే పాటలు వినసొంపుగా లేవు. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఫర్వాలేదు. ఇక సెకండాఫ్ విషయానికొస్తే.. ఇది కూడా ఫస్టాఫ్‌లాగే ప్రీ-క్లైమాక్స్ వరకు సాగుతుంది. అక్కడి నుంచి కథ ఇంట్రెస్టింగ్‌గా టర్న్ తీసుకుంటుంది. ఎమోషనల్ సెంటిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ అందరినీ కట్టి పడేస్తుంది. ఓవరాల్‌గా చూస్తే.. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లే ఈ చిత్రానికి ప్రధానం బలం.

ప్రారంభంలో హెబ్బా, రావ్ రమేష్ క్యారెక్టర్ల ఎలివేషన్ బాగుంది. ఆ తర్వాత హెబ్బా పటేల్ ముగ్గురు అబ్బాయిల్ని వలలో వేసుకునేందుకు చేసే ప్రయత్నాలే రొటీన్‌గా ఉండడంతో.. ఆ ఎపిసోడ్స్ బోర్ కొట్టించేశాయి. అలాగే స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగుతూ.. అక్కడక్కడా అనవసరమైన సన్నివేశాలు వస్తూ ఆడియెన్స్‌ని నీరసం వచ్చేలా చేశాయి. సినిమాలో కథ, ఎమోషన్, కామెడీ, రొమాన్స్ అన్నీ ఉండాలనే ఉద్దేశ్యంతో అన్నింటినీ టచ్ చేశాడు కానీ.. ఎమోషన్‌ని మినహా దేన్నీ పూర్తి స్థాయిలో పండించలేకపోయాడు. తండ్రీకూతుళ్ల రిలేషన్ గొప్పగా కనిపించింది కానీ.. మిగిలిన అంశాలన్నీ అసంపూర్తిగానే ముగిసిపోయాయి.

నటీనటుల పనితీరు :
హెబ్బా పటేల్ గురించి మాట్లాడుకుంటే.. పద్మావతి పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఓ కూతురిలా, ముగ్గురు అబ్బాయిల లవర్‌లా అద్భుత నటన ప్రదర్శించింది. అక్కడక్కడ గ్లామరసంతో వేడెక్కించింది కూడా. తండ్రి పాత్రలో రావ్ రమేష్ నటన భేష్ అని చెప్పుకోవచ్చు. ఆ క్యారెక్టర్‌కి ఆయన తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరేమో అనేంతగా నటించాడు. హెబ్బా ఫ్రెండ్‌గా తేజస్వి మడివాడ కూడా బాగానే నటించింది. అందాలు సైతం ఆరబోసింది. ఇక హెబ్బాకి బాయ్‌ఫ్రెండ్స్‌గా నోయెల్, అశ్విన్, పార్వతీశం బాగానే నటించారు.

సాంకేతిక పనితీరు :
ఛోటా కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్‌గా చూపించాడు. శేఖర్ చంద్ర సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే.. బాగుండేది. కథని సరికొత్తగా, బోల్డ్‌గా రాసిన రచయిత సాయికృష్ణ పనితనం మెప్పించింది. ప్రసన్న కుమార్ రాసిన డైలాగులు బాగా పేలాయి. బెక్కం వేణుగోపాల్ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టలేం. చివరగా.. దర్శకుడు భాస్కర్ బండి గురించి మట్లాడితే.. ఎక్కడా విపరీత ధోరణికి పోకుండా సినిమాని రూపొందించాడు. కానీ.. పూర్తి స్థాయిలో ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు.

ఫైనల్ వర్డ్ : లవ్ స్టోరీస్ ఫెయిల్.. ఎమోషన్ పాస్
‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ రేటింగ్ : 2.5/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news