Movies‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మూవీ రివ్యూ, రేటింగ్

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మూవీ రివ్యూ, రేటింగ్

Meelo Evaru Koteeswarudu movie review which is directed by famous director E Sattibabu who has track record to make good comedy films. In thi movie Naveen Chandra, Prudhvi, Saloni and Shruti sodhi played lead role.

సినిమా : మీలో ఎవరు కోటీశ్వరుడు
నటీనటులు : నవీన్‌చంద్ర, శృతి సోధి, థర్టీ ఇయర్స్‌ పృథ్వీ, సలోనీ, తదితరులు
దర్శకుడు : ఇ.సత్తిబాబు
నిర్మాత : రాధామోహన్‌
సినిమాటోగ్రఫీ : పి.బాల్‌రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్‌
ఎడిటింగ్ : గౌతమ్ రాజు
బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌
రిలీజ్ డేట్ : 16-12-2016

కామెడీ సినిమాల్ని తీయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన ఇ.సత్తిబాబు ఈసారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే మరో వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవీన్ చంద్ర, శృతి సోధి, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, సలోనీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రాధామోహన్ నిర్మించారు. ట్రైలర్ రిలీజైనప్పటి ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుండడం, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ హీరోగా నటిస్తుండడం, అతని సరసన సలోనీ కథానాయికగా కనిపించడంతో.. దీనికి మరింత క్రేజ్ వచ్చి పడింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్ని కూడా భారీ స్థాయిలోనే చేశారు. మరి.. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం వినోదాన్ని పంచిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందామా..

కథ :
ప్రశాంత్‌ (నవీన్‌చంద్ర) మంచి మనసున్న కుర్రాడు. జీవితంలో ఓ స్థాయికి ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒకరోజు రాత్రి రోడ్డుపై ప్రశాంత్ వెళుతుండగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏబీర్‌ (మురళీశర్మ) కుమార్తె ప్రియ (శృతి సోథి) మతిస్థిమితం లేని పరిస్థితిలో ఎదురవుతుంది. అప్పుడు ప్రశాంత్ ఆమెని వాళ్ల ఇంటికి తీసుకెళ్లి క్షేమంగా వదిలిపెడతాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ గురించి తెలుసుకున్న ప్రియ.. అతని ప్రేమలో పడుతుంది. ప్రశాంత్ కూడా ఆమెని ప్రేమిస్తాడు. అయితే.. వాళ్లిద్దరి ప్రేమకి ఏబీఆర్‌ అడ్డు చెబుతాడు. అప్పుడు అతనికి ప్రశాంత్ ఒక మాట చెబుతాడు. ఒకసారి నష్టపోతే ఆనందం విలువ తెలుస్తుందని.. అది తెలిసినప్పుడు మీరే మా ప్రేమని ఒప్పుకొంటారని అంటాడు.

ఆ మాటని సవాల్‌గా తీసుకొన్న ఏబీఆర్‌.. నష్టపోవడం కోసమే ఓ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటాడు. కచ్చితంగా నష్టాన్ని తెప్పించే వ్యాపారం గురించి ఎవరైనా ఐడియా ఇస్తే.. వారికి కోటి రూపాయలు ఇస్తానని ఏబీఆర్ ప్రకటన ఇస్తాడు. మరి.. ఆ ఐడియా ఎవరిచ్చారు? వ్యాపారంలో ఆరితేరిన ఏబీఆర్‌కి నష్టం వచ్చిందా..? ఇంతకీ స్టార్ వీరబాబు (పృథ్వీ), సమంత (సలోనీ) ఎవరు..? ప్రశాంత్, ప్రియ ప్రేమకథతో వారికి ఏం సంబంధం ఉంది..? చివరికి ప్రశాంత్, ప్రియలు ఒక్కటవుతారా? లేదా? అన్న అంశాలతో సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
ఈ సినిమా స్టోరీ కొత్తదేమీ కాదు.. అంతా పాత చింతకాయ పచ్చడియె. కాకపోతే.. వినోదపు పూత పూసి సరదాగా నడిపించారు. అసలు కథలోకి ఎంట్రీ అయ్యేవరకు రొటీన్‌గా సాగుతూ.. కాస్త బోర్ కొట్టించేస్తుంది. ఎప్పుడైతే అసలు స్టోరీ మొదలవుతుందో.. అప్పటినుంచి సినిమా వేగం పుంజుకుంది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎంట్రీ అయ్యాక సినిమా కామెడీగా సాగిపోతుంది.

ఫస్టాఫ్ గురించి మాట్లాడితే.. ప్రశాంత్, ప్రియ లవ్ స్టోరీతోనే సినిమా రొటీన్‌గా నడుస్తుంది. ఈ ప్రేమకథ అంతగా రుచించదు. ఎప్పుడైతే వీరి ప్రేమకి అవాంతరం ఎదురవుతుందో.. అప్పటినుంచి ఇంట్రెస్టింగ్‌గా టర్న్ తీసుకుంటుంది. ప్రశాంత్ చెప్పినట్లుగా ఏబీఆర్ నష్టం వచ్చే వ్యాపారం పెట్టాలని ఐడియా రావడం, ఇతనికి దివాళా తీసిన నిర్మాత (పోసాని), దర్శకుడు రోల్డ్‌గోల్డ్‌ రమేష్‌ (రఘుబాబు) తోడు కావటంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. వీరి మధ్య నడిచే ఎపిసోడ్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇక వీరితోపాటు జూనియర్‌ ఆర్టిస్ట్‌ వేరియేషన్‌ వీరబాబు (థర్టీ ఇయర్స్‌ పృథ్వీ) తోడయ్యాక.. కథ మరింత వేగం అందుకొంటుంది.

అయితే.. సెకండాఫ్‌లో ఆ ఊపు లేకపోవడంతో బోర్ అనిపిస్తుంది. అప్పటివరకు నవ్వులు పండించిన పృథ్వీకి, సలోని మధ్య సీరియస్ లవ్ స్టోరీ పెట్టి.. బోర్ కొట్టించేశారు. వీరి లవ్ స్టోరీ కారణంగా.. సినిమా పక్కదారి పట్టింది. అసలు హీరో, హీరోయిన్లు పతాక సన్నివేశాల్లో తప్ప ఎక్కడా కనిపించరు. అక్కడక్కడ వచ్చే కామెడీ నవ్వించింది. పాటలు కూడా ఆకట్టుకోలేదు. కామెడీ కోసం ఓసారి చూడొచ్చు.

నటీనటుల పనితీరు :
నవీన్ చంద్ర ఎప్పట్లాగే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. శృతి సోధి అందాల్ని ఆరబోయడంతోపాటు బాగానే నటించింది. ఇక పృథ్వీ అయితే.. ఇందులో బ్రహ్మాండంగా నటించి, తన సత్తా చాటాడు. ఇంటర్‌ చదివే మహేష్‌గా, వేరియేషన్‌ స్టార్‌ వీరబాబుగా ఇరగదీశాడు. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించేశాడు. పృథ్వీకి జోడిగా నటించిన సలోని అందంగా కనిపిస్తూనే నటనతో ఆకట్టుకుంది. పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నవ్వులు పండించే ప్రయత్నం చేశారు.

సాంకేతిక పనితీరు :
బాల్‌రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని చోట్ల ఈయన పనితనాన్ని మెచ్చుకోవచ్చు. వసంత్ అందించిన సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్ మీద కాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. రాధామోహన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు ఇ.సత్తి బాబు గురించి మాట్లాడుకుంటే.. కామెడీ సినిమాల్ని తెరకెక్కించడంలో తనదైన ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈసారి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కామెడీ పండించాడు కానీ.. పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో
తన మార్క్‌ని చూపించాడు.

ఫైనల్ వర్డ్ : టైంపాస్ కోసం ఓసారి చూడొచ్చు.
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రేటింగ్ : 2.5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news