అదేదో శాపం అన్నట్టుగా మెగా కుటుంబానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మెగా హీరోలు నటించిన సినిమాలు వరుసగా వచ్చినవి వచ్చినట్టు ఫ్లాప్ అవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమాతో రీఎంట్రీలో అదిరిపోయే సూపర్ హిట్ దక్కింది. ఇక నెలన్నర రోజుల్లో ముగ్గురు మెగా హీరోలు నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయ్యాయి.
బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు ఉన్నారు. ఈ సినిమా బయ్యర్లకు ఏకంగా రు. 30 కోట్ల నష్టం మిగిల్చింది. ఈ సినిమా వచ్చిన రెండు వారాలకు చిరంజీవి భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా అయితే ఏకంగా రు. 50 కోట్లకు పైగా నష్టాలు మిగిలింది. ఇక తాజాగా మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవ ధారి అర్జున సినిమా రిలీజ్ కాగా మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
అసలే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు ఫ్రీ రిలీజ్ బిజినెస్ తక్కువ జరిగిందన్న చర్చలు ట్రేడ్ వర్గాల్లో వినిపించాయి. ఇప్పుడు నెగిటివ్ టాక్ తో సినిమా కొన్నవాళ్ళు అంతా ఘోరంగా నష్టపోవడం ఖాయం అని అంటున్నారు. ఇక సోలోగా గత ఏడాది గని సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన వరుణ్ ఇప్పుడు మరో డిజాస్టర్ తో రేసులో వెనుకబడిపోయాడు. గాండీవ ధారి కూడా వరుణ్ కెరీర్ లో మరో గని అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
ఇక మెగా ఫ్యామిలీ నుంచి మళ్లీ హిట్ కొట్టాలంటే బన్నీ పుష్ప 2, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలతో పాటు చెర్రీ గేమ్ ఛేంజర్ సినిమాల మీదే ఆశలు ఉన్నాయి. ఏదేమైనా మెగా ఫ్యామిలీ హీరోలు కాంబినేషన్లు నమ్ముకోవడం మానేసి ఇకపై అయినా కథలను నమ్ముకుంటే తప్పా ఈ ప్లాపుల పరంపరకు బ్రేకులు పడేలా లేవు.