నిజంగా డైరెక్టర్ హరీష్ శంకర్ బకరానా అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఊరికి ముందు మొదలుపెట్టాడు. ఇప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఇప్పటికే బ్రో సినిమా రిలీజ్ అయింది. ఓజి కూడా క్రిస్మస్ లేదా సమ్మర్ కు రిలీజ్ అంటున్నారు.. అటు క్రిష్ హరిహర వీరమల్లు సినిమా కూడా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయింది.
అయినా ఉస్తాద్ సినిమా షూటింగ్ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. కేవలం త్రివిక్రమ్ ప్రాపకం లేకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కాల్ సీట్లు ఇవ్వటం లేదన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. హరీష్ శంకర్ మాత్రం అదిగో పులి ఇదిగో తోక అన్న చందంగా సినిమా గురించి ట్వీట్లు వేసుకుంటూ వస్తున్నారే తప్ప షూటింగ్ మాత్రం అస్సలు కదలడం లేదన్నది వాస్తవం.
ఇక తాజాగా వారాహి యాత్ర మరో విడత పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఏ సినిమాకు కాల్ సీట్లు ఇస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఉస్తాద్ సినిమాకు కాల్ సీట్లు కేటాయించారు. సెప్టెంబర్ ఐదు నుంచి ఈ సినిమా షూటింగ్లో పవన్ పాల్గొంటాడు. రెండు వారాలపాటు ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ శ్రీలీలతో పాటు కీలక నటినటులు ఇందులో పాల్గొంటారట.
ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. ఆ షెడ్యూల్లో తీసిన సన్నివేశాలతోనే ఏకంగా గ్లిమ్స్ కట్ చేసి రిలీజ్ చేశాడు హరీష్ శంకర్. అప్పట్లో ఇదంతా పవన్ అభిమానులకు ఒక ఫెస్టివల్ గా నడిచింది. ఇక ఇప్పుడు రెండో షెడ్యూల్ పూర్తయ్యాక కూడా మరో గ్లింప్స్ కట్ చేసి వదలటం తప్ప అంతకుమించి చేయటానికి ఏమీ ఉండదని సెటైర్లు పడుతున్నాయి.
ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న అన్ని సినిమాలు పూర్తయ్యాక కానీ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తి కాదని.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో ఏడాది తర్వాత కానీ ఈ సినిమా ధియేటర్లలోకి వచ్చే అవకాశాలు లేవంటున్నారు. అప్పటివరకు హరీష్ శంకర్ అదిగో ఇదిగో అంటూ ఈ సినిమా గురించి ట్వీట్లు వేసుకుంటూ కాలక్షేపం చేయటం మినహా చేసేదేమి లేదని ఇండస్ట్రీ జనాలు చెవులు కోరుక్కుంటున్నారు.