మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా రిలీజ్ అయింది ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఎవరికి వాళ్లు ఈ సినిమా పరాజయంపై రకరకాలుగా ఊహించుకుంటూ వార్తలు రాస్తున్నారు. కొందరు అసలు చిరంజీవి ఇలాంటి కథను ఎంచుకోవటం తప్పు అని ఆయన టార్గెట్ చేస్తుంటే.. మరికొందరు మెహర్ రమేష్ ను ఆడుకుంటున్నారు. ఇక చాలామంది సినిమాకు మ్యూజిక్ కూడా పెద్ద మైనస్ గా మారిందని.. మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ ను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే అనిల్ సుంకర భారీగా నష్టపోవడంతో ఆస్తులను అమ్ముకున్నారని.. ఆస్తులను తాకట్టు పెట్టారంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
కానీ ఇండస్ట్రీలో అనిల్ సుంకర గురించి ఎప్పుడు చిన్న కంప్లైంట్ కూడా లేదు. ఆయన చాలా మృదుస్వభావి అని చెబుతూ ఉంటారు. ఎవరినీ నొప్పించే మనస్తత్వం కాదని.. ఎక్కడైనా ఎవరితో అయినా ఇబ్బందులు వస్తే అనిల్ సుంకర సర్దుకుపోతూ ఉంటారని చెబుతారు. భోళా శంకర్ పరాజయంపై చిరంజీవికి రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు అనిల్ సుంకర ఆస్తులు అమ్ముకున్నారని.. ఆస్తులు తనఖా పెట్టారని పైగా చిరంజీవిని టార్గెట్గా చేసుకుని ఆయన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి.
సినిమా తీసిన నిర్మాతకు నష్టం వస్తే తోడుగా ఉండే వాళ్లే అసలైన హీరోలు.. ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంత సీనియర్లు అయినా జీరోలే అలాంటి జీరోలు హీరో కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా అనిల్ సుంకర అన్నట్టు ఒక కామెంట్ సోషల్ మీడియా తో పాటు ఇండస్ట్రీ వాట్సప్ గ్రూపుల్లో బాగా వైరల్ అయింది. అయితే దీనిని చూసి బాధపడ్డ మెగా అభిమాని ఒకరు అనిల్ సుంకరకు వాట్సప్ చేయగా తాను అమెరికా వెళుతున్నానని.. ప్రస్తుతం ఫ్లైట్ లో ఉన్నానని.. ఇలాంటివి పట్టించుకోవద్దు తాను చిరంజీవి గారితో మరో సినిమా తీసి సమాధానం చెప్పబోతున్నా.. చిరంజీవి గారు మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్న మనిషి అనిల్ సుంకర రిప్లై ఇచ్చారు. అలా రిప్లై ఇచ్చిన మెసేజ్ సదరు అభిమాని ఇప్పుడు గ్రూపుల్లో పెట్టడంతో అది విపరీతంగా వైరల్ అవుతుంది.
ఇక ఈ ఆర్టికల్ టైటిల్ లో అనిల్ సుంకరను టాలీవుడ్ సీనియర్ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్‌తో పోల్చడం జరిగింది. అశ్వినీదత్ కెరియర్ సినిమా రంగంలోనే ప్రారంభమైంది. ఆయన సంపాదించినా.. పోగొట్టుకున్నా.. తిరిగి సంపాదించిన కూడా సినిమా రంగంతోనే ఆయన అనుబంధం పెనవేసుకుపోయింది. ఈ రోజుకి కూడా వైజయంతి మూవీస్‌కు అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉండటానికి ఆయన ఇండస్ట్రీతో నడుచుకున్న విధానం అని చెప్పాలి. ఆయన సినిమా వల్ల నష్టపోతే సినిమాలో నటించిన ఏ ఒక్కరికి రెమ్యునరేషన్ తగ్గించిన దాఖలాలు లేవు.. సినిమా జయపుజయలు అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు.
ఒక హిట్టు సినిమా కోసం అందరూ ఎంతలా కష్టపడతారో.. ఒక ప్లాపు సినిమా కోసం కూడా అంతే కష్టపడతారు. అలాంటప్పుడు వారి కష్టాన్ని ఎందుకు ? తగ్గించాలి వారి రెమ్యునరేషన్ ఎందుకు ? కట్ చేయాలి అన్నదే అశ్వినీదత్ సిద్ధాంతం. శక్తి సినిమాకు ఆ రోజుల్లోనే రు. 20 కోట్ల నష్టం వాటిల్లింది.. ఆ సినిమా కొని నష్టపోయిన వారందరికి కూడా ఆయన డబ్బులు వెనక్కు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన కోలుకుని వరుసగా ఎవడే సుబ్రహ్మణ్యం – మహర్షి – మహానటి లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. జాతి రత్నాలు లాంటి చిన్న సినిమాతోనూ సూపర్ హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచమే మెచ్చేలా కల్కి 2898 AD సినిమాను రు. 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక ఇదే సూత్రం అనిల్ సుంకర కూడా వర్తిస్తుంది. అఖిల్‌తో తీసిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా హోల్‌సేల్ గా కొన్న బయ్యర్ ఒకరు దారుణంగా నష్టపోయారు. అయితే ఆయన్ను ఆదుకునేందుకు అనిల్ సుంకర తన వంతుగా కొంత మొత్తాన్ని వెనక ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫిగర్ విషయంలో ఇద్దరి మధ్య చర్చలు కుదర్లేదు. అనిల్ సుంకర మనస్తత్వం ఎలాంటిది అనేందుకు ఇక్కడే మరో ఉదాహరణ కూడా ఉంది. ఏజెంట్ సినిమా కొని దారుణంగా నష్టపోయిన బయ్యర్ ఎవరు అయితే ఉన్నారో ఆ బయ్యర్‌కే తమ సామజ వర్గమున సినిమా రైట్స్ కూడా ఇచ్చారు. అది కూడా నామినల్ రేటుకే కావటం గమనార్హం. దీంతోపాటు సదర బయ్యర్ కు కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వటంతో పాటు… భవిష్యత్తులోనూ తమ బ్యానర్లో వచ్చే సినిమాలు రైట్స్ కూడా ఇచ్చి ఆ నష్టాన్ని సర్దుబాటు చేయాలన్న ఆలోచనలోనే ఆయన ఉన్నారు.
ఇక భోళా శంకర్ ఆయనకు భారీ నష్టాలు తెచ్చిపెట్టి ఉండవచ్చు. అయినా ఈ సినిమాకు పనిచేసిన ఏ ఒక్కరికి ఆయన రెమ్యూనరేషన్ అయితే తగ్గించలేదు. తనకు తానుగా నష్టపోయారే తప్ప ఎవరిని నొప్పించలేదు. ఇక సినిమాకు కొని నష్టపోయిన వారికి కూడా ఎంతో కొంత అమౌంట్ అయినా కచ్చితంగా తిరిగి ఇస్తారు.. సర్దుబాట్లు చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే చిరంజీవి గారితోనే మరో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి భోళాశంకర్ సినిమా పరాజయం మర్చిపోయేలా చేయాలని ఆయన బలంగా తీర్మానించుకున్నట్టు ఆయన వాట్సాప్ సందేశం చెప్పకనే చెప్పింది. నిజం చెప్పాలంటే ఇలాంటి నిర్మాతలు టాలీవుడ్లో 10 కాలాలపాటు ఉండాలి.
ఇక స్టార్ హీరోల నుంచి.. ప్రతి ఒక్క హీరో కూడా ఇలాంటి నిర్మాత బ్యానర్లో సినిమాలు చేస్తే వాళ్లతో పాటు సదరు హీరోల విలువ కూడా పెరుగుతుంది. ఇలాంటి నిర్మాత కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటోళ్లకు ఓ సినిమా చేయాల్సిన బాధ్యత కూడా నిజంగా ఇండస్ట్రీ మంచి కోరుకునే హీరోల మీద ఉంటుంది. ఇక చిరంజీవి కూడా భోళాశంకర్ పరాజయం నుంచి ఆయనను తన వంతుగా ఆదుకునేందుకే మరో సినిమా ఆయన బ్యానర్లో చేస్తానని హామీ ఇచ్చేశారు. అందుకనే అనిల్ సుంకర అంత ధీమాతో బాస్‌తో మరో సినిమా ఉందని ప్రకటన వెంటనే చేసేశారు. ఏదేమైనా అనిల్ సుంకర చిరంజీవితో మరో హిట్ తీయడం కాదు… ఇండస్ట్రీ గర్వించేలా భారీ బ్లాక్‌బస్టర్లు.. పాన్ ఇండియా సినిమాలు తీయాలని ప్రతిఒక్కరం మనస్ఫూర్తిగా కోరుకుందాం..!