టాలీవుడ్ లో ఉన్న సూపర్ టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరైన సుకుమార్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రంగస్థలం సినిమా చేస్తున్నాడు. సుకుమార్ మార్క్ కు కాస్త దూరంగా వస్తున్న ఈ సినిమా 1985 కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో చేరేలా చేసింది. టీజర్ లో చరణ్ లుక్.. డైలాగ్ డెలివరీ.. అన్ని అదరగొట్టాయి.
ఇక ఈ సినిమా టీజర్ చూశాక సినిమా బిజినెస్ రేంజ్ పెరిగింది. ఇప్పటికే నైజాం, సీడెడ్ లు కలిపి 30 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. ఇక మిగతా ఏరియాల్లో కూడా ఇదే రకమైన బిజినెస్ చేస్తుందని అంటున్నారు. ఓవరాల్ గా రంగస్థలం 70 నుండి 80 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందట. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు భారీ డిమాండే ఏర్పడింది.
ధ్రువ తర్వాత చరణ్ చేస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ గురి పెట్టుకుని ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.