MoviesTL రివ్యూ: స్పై

TL రివ్యూ: స్పై

టైటిల్‌: స్పై
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, రానా దగ్గుబాటి, తదితరులు
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
మ్యూజిక్‌: విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి
దర్శక‌త్వం : గ్యారీ బి హెచ్
రిలీజ్ డేట్‌ : జూన్ 29, 2023

నిఖిల్ సిద్దార్థ కార్తీకేయ 2 సినిమాతో ఒక్క‌సారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కార్తీకేయ 2 పాన్ ఇండియా రేంజ్‌లో సూప‌ర్ హిట్ కొట్టింది. ఈ సినిమా త‌ర్వాత వ‌చ్చిన 18 పేజెస్ యావ‌రేజ్ కంటెంట్‌తో కూడా గ‌ట్టెక్కేసింది. ఇక ఇప్పుడు ఏకంగా నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ డెత్ మిస్ట‌రీ నేప‌థ్యంలో స్పై అనే గూడ‌ఛారి థ్రిల్ల‌ర్ మూవీలో న‌టించాడు. ఎడిట‌ర్ గ్యారీ బి హెచ్ దర్శకత్వంలో వచ్చిన తాజా యాక్షన్ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పించిందో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
విజయ్ (నిఖిల్) ఒక అండర్ కవర్ ఏజెంట్‌గా ప‌ని చేస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలోనే తన అన్న ఏజెంట్ సుభాష్ (ఆర్యన్ రాజేష్) ని ఎవరు చంపారో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. ఇంత‌లోనే విజయ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఖాదిర్ ఖాన్ , అతడు చేసే మారణహోమాన్ని అడ్డుకుని.. అత‌డిని ప‌ట్టుకుని ఇండియా గ‌వ‌ర్న‌మెంట్‌కు అప్ప‌గించే మిష‌న్ కూడా విజ‌య్‌కు వ‌స్తుంది. ఈ మిష‌న్‌లోనే త‌న అన్న సుభాష్ చ‌నిపోయాడ‌న్న నిజం విజ‌య్‌కు తెలుస్తుంది. అస‌లు సుభాష్ ఎవ‌రు ? ఈ మిష‌న్‌కు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మిస్సింగ్‌కు, ఆ మిస్సింగ్ ఫైల్‌కు ఉన్న లింక్ ఏంటి ? విజ‌య్ త‌న టాస్క్‌ను పూర్తి చేశాడా ? లేదా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
నిఖిల్ త‌న గ‌త సినిమాల‌తో పోలిస్తే భిన్నంగా ఈ సారి ఉగ్రవాద నేపథ్యంలో యాక్షన్ స్పై సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. రా ఏజెంట్ గా నిఖిల్ నటన సినిమాకే హైలెట్. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తో నడిచే ప్రేమ సన్నివేశాలు, వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంటుంది. ర‌చ‌యిత రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాసుకున్న మెయిన్ కోర్ పాయింట్‌, యాక్ష‌న్ సీన్లు బాగున్నాయి. నిఖిల్ – అభినవ్ గోమఠంకి మధ్య పంచ్ లు నవ్విస్తాయి. హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్, విలన్ జిషు సేన్ గుప్తా, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం ఇత‌ర న‌టులు పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సినిమాలో యాక్ష‌న్ ఎలిమెంట్స్ బాగానే డిజైన్ చేసుకున్నారు. మెయిన్ పాయింట్ బాగున్నా స్పైలో పెద్ద‌గా క‌థ లేక‌పోవ‌డం.. క‌థ‌నం రెగ్యుల‌ర్‌గా ఉండ‌డం మైన‌స్‌. క‌థ‌నం అయితే చాలా చోట్ల ఏ మాత్రం లాజిక్‌లు లేకుండా వెళ్లిపోతూ ఉంటుంది. చాలా సీన్లు సినిమాటిక్‌గా ఉంటాయి. క‌థ అంతా ఖాదీర్ ఖాన్ అనే టెర్రరిస్ట్ చుట్టే కథను మొత్తం చుట్టేయడం.. చైనా – ఇండియా మధ్య అటాక్ సీన్లు కూడా బోర్‌గా ఉన్నాయి.

సెకండాఫ్‌లో మ‌రో కొత్త విల‌న్ ఎంట్రీ, రెండు దేశాల మ‌ధ్య యుద్ధ స‌న్నివేశాలు, భీక‌ర‌మైన పోరాట స‌న్నివేశాలు, హంగామా ఉన్నా ఏ ఒక్క సీన్ కూడా ఆక‌ట్టుకోదు. సినిమాలో సోష‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు చాలా చోట్ల స్టైలీష్ మేకింగ్, ఇంట్ర‌స్టింగ్ అంశాలు ఉన్నా నాట‌కీయ స‌న్నివేశాలు ఎక్కువ అయ్యాయి. ఇక హీరోయిన్ ఐశ్వ‌ర్య పాత్ర కూడా బ‌లంగా లేదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ డ్రామాను ఇంకా బలంగా రాసుకునే ఛాన్స్ కూడా ద‌ర్శ‌కుడు అలా చేయ‌లేదు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే..
టెక్నిక‌ల్‌గా ద‌ర్శ‌కుడు గ్యారీ హిస్టారికల్ అంశాలకి ఉగ్రవాద అంశాలు కలిపి ఈ సినిమా తెర‌కెక్కించాడు. అయినా కూడా క‌మ‌ర్షియ‌ల్ సినిమా చూసిన ఫీలింగే క‌లుగుతుంది. ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. అయితే చాలా చోట్ల లాజిక్‌లు మిస్ కావ‌డం, భావోద్వేగాలు క‌నెక్ట్ కాక‌పోవ‌డం మైన‌స్‌. సినిమాటోగ్ర‌ఫీ, నేప‌థ్య సంగీతం బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

ఫైన‌ల్గా…
మంచి అంచనాలతో వ‌చ్చిన స్పై అనే యాక్ష‌న్ డ్రామాలో నిఖిల్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. సినిమాలో సింపుల్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వ‌డం మైన‌స్‌. యాక్షన్ ఎలిమెంట్స్, గూఢ‌చారి సినిమాలు, నిఖిల్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే ఈ సినిమా ఓ మోస్త‌రుగా క‌నెక్ట్ అవుతుంది.. అంతే..!

స్పై మూవీ TL రేటింగ్ : 2.5 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news