Moviesఅర‌బిక్ పాట‌ను ఉప‌యోగించుకున్న తొలి తెలుగు చిత్రం `గ‌ల్ప్‌` - ద‌ర్శ‌కుడు...

అర‌బిక్ పాట‌ను ఉప‌యోగించుకున్న తొలి తెలుగు చిత్రం `గ‌ల్ప్‌` – ద‌ర్శ‌కుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి

గ‌ల్ప్ వ‌ల‌స‌ల నేప‌థ్యంలో పి.సునీల్‌కుమార్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం `గ‌ల్ఫ్`. శ్రావ్య ఫిలిమ్స్ ప‌తాకంపై యెక్క‌లి ర‌వీంద్ర‌బాబు, ఎం.ర‌మ‌ణీకుమారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేత‌న్ మ‌ద్దినేని, డింపుల్ ఇందులో హీరో హీరోయిన్లు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఎడిటింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా విశేషాల‌ను

ద‌ర్శ‌కుడు సునీల్‌కుమార్‌రెడ్డి తెలియ‌జేస్తూ “ ఇలాంటి నేప‌థ్యంలో ఇంత‌వ‌ర‌కు తెలుగులో సినిమా రాలేదు. అనేక య‌థార్థ గాథ‌ల‌ను ప‌రిశీలించి, ప‌రిశోధించి ఈ స్క్రిప్టు త‌యారు చేశాం. రామోజీ ఫిల్మ్ సిటీ, హైద‌రాబాద్ ప‌రిస‌రాలు, గ‌ల్ప్ కంట్రీస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఈ సినిమాలో ఒక అర‌బిక్ పాట‌ను సంద‌ర్భోచితంగా చిత్రీక‌రించాం. ఇలా ఒక తెలుగు సినిమాలో అర‌బిక్ పాట‌ను ఉప‌యోగించుకోవ‌డం ఇదే ప్ర‌థ‌మం. సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ ఇమ్మ‌డి ఇచ్చిన ట్యూన్‌కి కువైట్‌లో పాపుల‌ర్ సింగర్ అండ్ రైట‌ర్ అయిన అబ్దులాల్ సాలెమ్ అర‌బిక్ సాహిత్యం స‌మ‌కూర్చి, త‌నే ఆల‌పించారు. `అల్లాయా మ‌హ్లా హ‌వానా` అనే ఈ అర‌బిక్ గీతాన్ని కువైట్ లోని ఫ్రాంకో అర‌బ్ రికార్డింగ్ స్టూడియోలో రికార్డ్ చేశాం. అర‌బ్ కంట్రీలో రికార్డైన తొలి తెలుగు సినిమా పాట కూడా ఇదే అవుతుంది. ఈ అర‌బిక్ గీతాన్ని దిగ్విజ‌య‌, ఉస్మాన్‌, షాన్‌, 10 మంది డ్యాన్స‌ర్ల‌పై చిత్రీక‌రించాం. గ‌ల్ప్ కొరియోగ్రాఫ‌ర్ మ‌హ్మ‌ద్ ఇమ్రాన్ నృత్య ద‌ర్శ‌క‌త్వం చేశారు. అర‌బిక్ క‌ల్చ‌ర్‌ని, అర‌బిక్ ట్రెడిష‌న‌ల్ డ్యాన్ల‌ని ఈ పాట‌లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాం“ అని తెలిపారు.

నిర్మాత‌లు యెక్క‌లి ర‌వీంద్ర‌బాబు, ఎం.ర‌మ‌ణీకుమారి మాట్లాడుతూ “సునీల్ కుమార్ రెడ్డి, ఇంత‌కు ముందు తీసిన `సొంత‌వూరు`, `గంగ‌పుత్రులు`, `ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌` త‌దిత‌ర చిత్రాలలోకి పూర్తి భిన్నంగా ఉంటుందీ చిత్రం. ఇటీవ‌లే రామోజీ ఫిల్మ్ సిటీలో స్టంట్ మాస్ట‌ర్ డ్రాగ‌న్ ప్ర‌కాశ్ నేతృత్వంలో పోరాట స‌న్నివేశాలు చిత్రీక‌రించాం. దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. చాలా మంది కొత్త న‌టీన‌టుల‌తో పాటు పోసాని కృష్ణ‌ముర‌ళి, తోట‌ప‌ల్లి మ‌ధు, నాగినీడు, తీర్థ‌, జీవా, బిత్తిరి స‌త్తి లాంటి ప్ర‌ముఖులు న‌టించారు. డిసెంబ‌ర్‌లో పాట‌ల‌ను, జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం“ అని చెప్పారు.

ఈ చిత్రానికి మాట‌లు: పుల‌గం చిన్నారాయ‌ణ‌; స‌ంగీతం: ప‌్ర‌వీణ్ ఇమ్మ‌డి, పాట‌లు: మాస్ట‌ర్జీ, సిరాశ్రీ, కాస‌ర్ల శ్యామ్‌, కెమెరా: ఎస్‌.వి.శివ‌రామ్‌, ఆర్ట్: నాగు, స‌హ నిర్మాత‌లు: డాక్ట‌ర్ ఎల్‌.ఎన్‌.రావు, రాజాజీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: బాపిరాజు, నిర్మాత‌లు: యెక్క‌లి ర‌వీంద్ర‌బాబు, ర‌మ‌ణికుమారి, క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: సునీల్ కుమార్ రెడ్డి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news