అన్నగారు ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు.. సంగీత ప్రధానంగా ఉంటాయి. ఉన్నాయి కూడా. ఇది అన్నగారి అభిరుచో.. లేక దర్శకుల అభిరుచో ఏదైనా కూడా అన్నగారు నటించిన సాంఘిక చిత్రాల్లోని పాటలన్నీ.. తేనెలు ఒలికిస్తాయనడంలో సందేహం లేదు. అయితే.. అదేసమయంలో అనేక పాటల్లో దేశభక్తిని, చైతన్యాన్ని కూడా కలగలిపిన నేపథ్యాలు కూడా ఉన్నాయి. ఇవి మాత్రంచాలావరకు అన్నగారు చెప్పి రాయించుకునేవారని సీ నారాయణరెడ్డిగారు చెప్పేవారు.
రామారావుగారికి ఒక లక్షణం ఉండేది. తెలుగు అంటే ఆయనకు మహా ఇష్టం. ముఖ్యంగా పాటలంటే.. ఆయనకు ఎంతో ఇష్టం. చైతన్య గీతాలన్నా.. దేశభక్తి గీతాలన్నా. ఎంతో ఇష్టం. మూడు గంటల సినిమాలో చెప్పే(అప్పట్లో సినిమాలు 3 గంటల నిడివితో ఉండేవి.. ఇప్పుడు 2 గంటలకు తగ్గిపోయాయి లేండి)…సందేశం.. ఒక్క పాటలో కూర్చేయాలి రెడ్డిగారు! అనేవారు. ఎందుకు? అని అడిగితే.. సినిమా ఎవడు గుర్తు పెట్టుకుంటారు.. పాటలైతే.. ఒకరి నుంచి ఒకరికి చేరతాయి. అనేవారు. అందుకే ఆయన సినిమాల్లో పాటలకు పెద్దపీట వేసేవారు అని ఒక ఇంటర్వ్యూలో నారాయణరెడ్డి అన్నగారి అభిరుచి గురించి చెప్పుకొచ్చారు.
ఇలా.. వచ్చిన గీతాల్లోనే.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఏమాత్రం భయం లేకుండా.. అన్నగారు.. తెలుగు జాతి మనది. అనే గీతాన్ని ప్రత్యేకంగా రాయించుకుని సినిమాలో వాడి.. తెలుగు జాతి కలిసి ఉండాలని తపించారని చెప్పుకొచ్చారు సినారే. ఆ ఒక్క సందర్భంలోనే కాదు.. అనేక సినిమాల్లో అన్నగారు.. సందేశాత్మక గీతాలు.. చారిత్రక నేపథ్యం ఉన్న పాటలకు ప్రాధాన్యం ఇచ్చారని.. అవి ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.
పాండురంగ మహత్యం సినిమాలో చిట్టచివర.. హేకృష్ణా ముకుందామురారి పాటను అన్నగారు పట్టుబట్టి రాయించుకున్నారని చెప్పారు. ఇది సొంత బ్యానర్‌పై అన్నగారు తీసిన సినిమా కావడం, మొత్తం కృష్ణతత్వం అంతా కూడా దీనిలో పెట్టాలని భావించడం వల్లే సాధ్యమైదని సినారే చెప్పుకొచ్చారు. ఇదీ. అన్నగారి ఉత్తమాభిరుచి అని వెల్లడించారు.