రక్తకన్నీరు నాగభూషణం.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ సుపరిచితమే. ఆయన వేయని రోల్‌లేదు. నెగిటివ్ పాత్రల్లో అయితే.. నాగభూషణానికి తిరుగులేదని అంటారు. అనేక సినిమాల్లో నటించిన నాగభూషణం.. అగ్రహీరోలకు సాటిరాగల అభిమానులను పెంచుకున్నారు. ఆయనకు అభిమాన సంఘాలు ఎక్కువగా ఉండేవి. రావుగోపాలరావు-నాగభూషణం ఇద్దరూ కూడా.. అభిమాన సంఘాల విషయంలో పోటీ పడేవారు.
మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ అభిమాన సంఘాలకు దీటుగా నాగభూషణం అభిమానులు ఉండేవారు. రావు గోపాలరావు విషయంలో అయితే.. ఒకరికి మించి ఒకరు పైచేయిసాధించాలని భావించేవారు. నాగభూషణం ఏకంగా.. తన సినిమాల్లో 25 శాతం విరాళాలుగా ఇచ్చి అభిమానులను సంతృప్తి పరిచేవారు. అయితే..నాగభూషణం ఎక్కువగా.. కోరుకునేది తనకు భారీ ఎత్తున మర్యాదలు.. గౌరవాలు దక్కాలని.
ఒకసారి నాగభూషణం విజయవాడ వస్తే.. ఆయనకు అభిమానులు ఏకంగా అంబారీ కట్టి ఊరేగించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి దుర్గా కళామందిరం వరకు ఆయనను పూలపై నడిపించారు. ఇలా.. నాగభూషణం.. అభిమానులను ఎక్కువగా పెంచి పోషించారు. వారికి విందులు. వినోదాలు ఎక్కడా తక్కువ చేసేవారు కాదు. నాగభూషణం పుట్టిన రోజు వస్తే చాలు.. ఊరంతా పండగే అన్నట్టుగా ఉండేది. పెద్ద ఎత్తున అన్నదానాలు.. వస్త్ర దానాలు చేసేవారు.
రావుగోపాలరావు కూడా ఇలానే చేసినా.. తర్వాత తర్వాత.. ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పటికీ.. తెనాలి, గుంటూరు జిల్లాల్లో నాగభూషణం విగ్రహాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందంటే.. తనకు సినిమాలు లేకపోయినా.. అప్పులు చేసి మరీ అభిమానుల ను సంతృప్తి పరిచేవరకు వెళ్లింది. ఇక, వ్యక్తిగత అలవాట్లు సరేసరి. ఈ పరిస్థితితోనే నాగభూషణం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా చితికిపోయారు. చివరకు ఎలా మరణించారో అందరికీ తెలిసిందే.