తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన చేసినన్ని ప్రయోగాత్మక సినిమాలు మరో దర్శకుడు చేయలేదు. అస్సలు ఒక్క మాట కూడా లేకుండా సినిమా తీయడం సాధ్యమేనా? అసలు ఎవరైనా చూస్తారా? అని సందేహాలు తచ్చాడుతున్న సమయంలో ధైర్యంగా పుష్పక విమానం సినిమా తీశారు. ఇది సింగీతం శ్రీనివాసరావు కే సాధ్యమైంది. కమల్‌హాసన్, అక్కినేని అమల ప్రధాన పాత్రల్లో నటించిన ‘పుష్పక విమానం’ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. అయితే.. హీరోయిన్‌గా అమల ఎలా పరిచయం అయ్యారు అనేది ఇక్కడ ఇంటరస్టింగ్ ఇష్యూ.
మొదట ఈ కథకు నీలమ్ కొఠారి అనే ముంబయి నటిని అనుకున్నారు. ఒకే కూడా చేశారు. అయితే, ఆమె కొన్ని షరతులు పెట్టారు. తనతో పాటు హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ వస్తుందని నీలమ్ చెప్పింది. ఇదొక ప్రత్యేక చిత్రం. సాధారణం చిత్రమైతే అడిగినవన్నీ ఇచ్చేవాళ్లం అని చెప్పారు సింగీతం. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈ దశలో రమేశ్ సిప్పీని కలిస్తే, ఒక అమ్మాయి ఉంది. చాలా అందంగా ఉంటుంది. ఇప్పటివరకూ ఆమె నటించిన నాలుగైదు చిత్రాలు సగంలో ఆగిపోయాయి. ఒక్కటి కూడా విడుదలకు నోచుకోలేదు. ఐరన్‌లెగ్. మీకు అలాంటి సెంటిమెంట్‌లు లేకపోతే వెళ్లి కలవండి. ఆమె పేరు మాధురీదీక్షిత్ అని చెప్పారు.
ఆ సమయంలో మాధురీ దీక్షిత్ చిరునామా కనుక్కోవడం కొంచెం కష్టమైంది. ఎలాగో కనుక్కొని వెళ్లి, ఆమె పీఏని కలిశారు. అతనికి విషయం చెబితే, ‘మా హీరోయిన్ డైలాగ్‌లు లేని అలాంటి సినిమాలు చేయదు’ అని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వాళ్లు సింగీతానికి సన్మానం చేస్తే, ఆ కార్యక్రమానికి అమల వచ్చారు. అంతకుముందు అమల శివాజీ గణేశన్‌తో ఒక సినిమా చేసింది. నటించడం సరిగా రాదు. కానీ, ఆమె ఫేస్ చూస్తే సింగీతం శ్రీనివాసరావుకు అలా అనిపించలేదు. దీంతో ‘పుష్పక విమానం’లో తీసుకున్నారు.