స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా దూసుకుపోతున్నాడు. తన మైమరిపించే యాక్టింగ్, డాన్సులతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. దీంతో ఆయన సినిమాలే కాదు ఆయనకు సంభందిచి ఏ చిన్న మేటర్ బయటకి లీక్ అయినా సోషల్ మీడియా, యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఏ హీరో కి లేనంతమంది అభిమానులు బన్నీకి సోషల్ మీడియాలో ఉన్నారు.
అతడి సినిమా ఫస్ట్ లుక్ వచ్చినా, టీజర్ వచ్చినా సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తాల్సిందే. యూట్యూబ్‌లో అతడి సినిమాలకు సంబంధించిన ఏ విశేషం బయటికి వచ్చినా వ్యూస్ భారీగా ఉంటాయి. ఇక అతడి సినిమాలు యూట్యూబ్‌లో రిలీజ్ చేసినా వ్యూస్ అలాగే ఉంటాయి. ఈ మధ్య బన్నీ సినిమాల్ని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే ఊహించని స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి యావరేజ్ మూవీని హిందీలో రిలీజ్ చేస్తే ఇప్పటిదాకా ఏకంగా 5 కోట్ల వ్యూస్ వచ్చాయి. కొన్ని నెలల కిందట ‘సరైనోడు’ను హిందీలో రిలీజ్ చేస్తే దాని వ్యూస్ 10 కోట్లు దాటిపోయాయి.
తెలుగులో ఒక మాదిరిగా ఆడిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను యూట్యూబ్‌లో హిందీలో రిలీజ్ చేస్తే 15 గంటల్లో 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక రోజు పూర్తయ్యేసరికి వ్యూస్ 40 లక్షలు దాటేలా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా హిందీలోకి డబ్ అవుతున్న తెలుగు సినిమాలకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది.
‘రెబల్’ లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీకి కూడా అక్కడ కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. కేవలం యూట్యూబ్‌లోనే కాక.. హిందీ ఛానెళ్లలో కూడా తెలుగు డబ్బింగ్ సినిమాలకు రెస్పాన్స్, రేటింగ్స్ అదిరిపోతున్నాయి. దీంతో మన స్టార్ హీరోల సినిమాల హిందీ హక్కుల్ని కోట్లు పెట్టి కొంటున్నారు హిందీ నిర్మాతలు. ఈ విధంగానే ‘దువ్వాడ జగన్నాథం’ హిందీ హక్కులు తొమ్మిది కోట్లు పలికింది. స్టయిలిష్ స్టార్ ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచం లో సూపర్ స్టార్ అయ్యాడు.