సినిమా రంగంలో కథలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్లు ప్రేమ, పంతాలు, పగలు, విలన్లు మామూలు. అయితే కొన్ని ప్రత్యేకమైన సినిమాల విషయానికి వస్తే చారిత్రక, జానపదం, పౌరాణికం విషయాల్లో కథలు కాస్త అటు ఇటుగా ఉన్నా.. అక్కడ కూడా ప్రేమ, పగలు, పంతాలు ఎమోషన్ మామూలే. అయితే ఒక్కోసారి ఇతర భాషల్లో హిట్ అయిన కథలను రీమేక్ అని చెప్పకుండా యధావిధిగా దించేస్తూ ఉంటారు. మన తెలుగులో ఇలా కాపీ కొట్టేసే స్టార్ డైరెక్టర్లు కూడా ఎంతోమంది ఉన్నారు.
చివరకు మనం ఎంతో గొప్ప డైరెక్టర్ అని చెప్పుకునే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం.. అజ్ఞాతవాసి సినిమాను ఓ ఫ్రెంచ్ సినిమాకు కాపీగా తీసేసాడని తీవ్రమైన విమర్శలు రావడం తెలిసిందే.
ఇదిలా ఉంటే నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఒక సినిమా విషయంలో కూడా కాపీ అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక్కడ కాపీ కొట్టడం కంటే బాలయ్య నటించిన ఒక హిట్ సినిమాను కాస్త అటు ఇటుగా తిప్పి మరికొన్ని సినిమాల్లోని సీన్లను కాపీ కొట్టి మళ్ళీ బాలయ్య తోనే సినిమా తీయడం విచిత్రం.
ఆ సినిమా ఏదో కాదు ఒక్కమగాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2008 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచిపోయింది. బాలయ్యకు వైవిఎస్ చౌదరి స్వతహాగా వీరాభిమాని. అప్పటికే వైవిఎస్ చౌదరి హరికృష్ణతో రెండు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి.. ఉండడంతో అదే నమ్మకంతో బాలయ్య కథ పెద్దగా వినకుండానే ఆయనకు ఛాన్స్ ఇచ్చారు.
ఆ నమ్మకాన్ని వైవిఎస్ చౌదరి పోగొటుకున్నారు. బాలయ్య నటించిన సూపర్ హిట్ సినిమా నరసింహనాయుడు.. కమలహాసన్ భారతీయుడు సినిమాలను మిక్స్ చేసి ఒక్క మగాడు సినిమాను తెరకెక్కించారని విమర్శలు వచ్చాయి. వైవిఎస్ చౌదరి సినిమాలో బలమైన కథ, కథనాలను గాలికి వదిలేసి గ్రాఫిక్స్ – టెక్నికల్ విషయాలకు ప్రయార్టీ ఇచ్చారు. దీనికి తోడు సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇవన్నీ కలిసి బాలకృష్ణకు మరో డిజాస్టర్ మిగిల్చాయి.
ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చాలా ఏళ్లపాటు వైవిఎస్ చౌదరి అడ్రస్ లేకుండా పోయారు. బాలయ్య సైతం సినిమా రిలీజ్ తర్వాత చౌదరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా అంటారు. నిన్ను నమ్మి ఛాన్స్ ఇస్తే ఎంత పేలవమైన సినిమా తీస్తావా అని బాలయ్య కోపం వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ ఉంది.