సినిమా రంగంలో ఒకరిని ఒకరు అనుకరిస్తూ నటించడం… డాన్సులు చేయటం మామూలే. అయితే ఇది ఒక్కోసారి కాంట్రవర్సీలకు కూడా దారితీస్తూ ఉంటుంది. ఉదాహరణకు కింగ్ సినిమాలో బ్రహ్మానందం రోల్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఇమిటేట్ చేస్తూ కావాలనే పెట్టారని అప్పట్లో పెద్ద వివాదం జరిగింది. అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కు కౌంటర్లు ఇచ్చేలా కొందరు డైరెక్టర్లు తమ సినిమాల్లో సీన్లు పెట్టారు అన్న పుకార్లు కూడా వినిపించాయి. అలాగే బాలయ్య సినిమాల్లోనూ ఎప్పటికప్పుడు కౌంటర్లు పడుతూ ఉంటాయి.
ఇదిలా ఉంటే సీనియర్ నటులను అనుకరిస్తూ నటించడం అనేది ఇప్పటినుంచే కాదు.. టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల నుంచే నడుస్తోంది. అప్పట్లో మహానటి సావిత్రి తనకు మాత్రమే సొంతమైన నటనతో కొట్లాదిమంది అభిమానులను సొంతం చేసు
కున్నారు. సావిత్రి డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్.. బాడీ లాంగ్వేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ విషయంలోనూ ఆమెకు ఎవరు సాటిరారు. ఒకానొక సందర్భంలో ఒక కంటి నుంచి నీటిని రాల్చాల్సిన సందర్భం వచ్చినప్పుడు సావిత్రి గ్లిజరిన్ పెట్టుకోకుండా ఒక కంటి నుంచి నీళ్లు రాల్చారు.
అది చూసిన ప్రఖ్యాత దర్శకులు కె.వి.రెడ్డికి మతి పోయినంత పని అయిందట. ఈ ఒక్క సీన్ చూసి ఆమె ఎంతో గొప్ప నటి అవుతుందని ఆయన చెప్పగా… నిజంగానే సావిత్రి అంత మహానటి అయ్యారు. అయితే ఆమె తర్వాత తరంలో వచ్చిన మరో నటి వాణిశ్రీ కెరీర్ ప్రారంభంలో సావిత్రిని ఇమిటేట్ చేస్తూ ఉండేవారట. సినిమాల్లో డైలాగులు పరంగా ఎక్స్ప్రెషన్ల పరంగా సావిత్రిని చూసి.. ఆమెలా నటించేందుకు ప్రయత్నించే వారట. అయితే వాణిశ్రీ సావిత్రిని అనుకరిస్తుందన్న ప్రచారం బయటకు వచ్చేసింది.
ఈ విషయం తెలుసుకున్న సావిత్రి అగ్గిమీద గుగ్గిలం అయిపోయింది. తర్వాత ఓ రోజు వాణిశ్రీ తో నువ్వు నీలా నటించేందుకు ప్రయత్నించు.. నన్ను ఎందుకు అనుకరిస్తావు.. నువ్వు నీలా చేసినప్పుడే నీకు గుర్తింపు ఉంటుందని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పడేసారట. అప్పటినుంచి వాణిశ్రీ సావిత్రి స్టైల్ ని అనుకరించడం మానేస్తూ.. తనకంటూ ఒక ఓన్ స్టైల్ ఏర్పరచుకుందని అంటారు. ఆ తర్వాత వాణిశ్రీ కూడా ఎన్నో సినిమాలలో నటించి గొప్పనటిగా పేరు తెచ్చుకున్నారు.