నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. బాలయ్య – కోడి రామకృష్ణ కాంబినేషన్ అంటేనే అప్పట్లో తిరుగులేని క్రేజ్ ఉండేది. బాలయ్యకు తొలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఘనత కూడా కోడి రామకృష్ణదే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమా ఏకంగా మూడు థియేటర్లలో సంవత్సరం పాటు ఆడింది. ఈ రికార్డు బాలయ్య కెరీర్ లో ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయింది.
కోడి రామకృష్ణ – బాలయ్య కాంబినేషన్లో 1989లో వచ్చిన సూపర్ హిట్ సినిమా బాలగోపాలుడు. పివిఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎమ్మార్పీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణ – సుహాసిని జంటగా నటించగా… రాజ్‌కోటి సంగీతం సమకూర్చారు. బాలగోపాలుడు సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బాల కళాకారుడిగా కనిపించారు. బాలయ్య పట్టుబట్టి ఈ పాత్రకు కళ్యాణ్ రామ్ ఎంపిక చేయటం విశేషం.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రాజు అనే బాల కళాకారుడిగా నటించారు. అలాగే ఒకప్పటి హీరోయిన్ రాశి బాలగోపాలుడు సినిమాలో లక్ష్మి అనే పాత్రలో కనిపించింది. రాశి బాలనటిగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రవేశించారు. ఆమె అంతకుముందు తమిళంలో మంత్ర అనే పేరుతో నటించారు. చెన్నైలో జన్మించిన రాశి తల్లి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం. అలాగే ఆమె తండ్రిది చెన్నై. ముందుగా బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ అయ్యారు.
ఆమె ముందుగా దర్శకుడు సురేష్ వర్మను ప్రేమ వివాహం చేసుకున్నారని అంటారు. ఆ తర్వాత అతడికి విడాకులు ఇచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక బాలగోపాలుడు సినిమాలో బాలనటిగా నటించిన రాశి తర్వాత అదే బాలయ్యకు జోడిగా కృష్ణబాబు సినిమాలో నటించటం విశేషం. అలాగే ఎన్టీఆర్‌కు బడిపంతులు సినిమాలో మనవరాలుగా కనిపించిన శ్రీదేవి.. తర్వాత అదే ఎన్టీఆర్‌కు జోడిగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.