మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్లో ఇప్పుడు సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ అంటే రచ్చ మామూలుగా ఉండదు. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో 18 ఏళ్ల క్రితమే అతడు సినిమా వచ్చింది. ఆ తర్వాత 2010లో ఖలేజా సినిమా వచ్చింది. కమర్షియల్ కోణంలో ఈ రెండు సినిమాలు అంత సక్సెస్ కాలేదు. కానీ టీవీల్లో ఈ సినిమాలు చూస్తుంటే మాత్రం ఒళ్లు జలదరించేలా ఉంటాయి సీన్లు.
నిజంగా త్రివిక్రమ్ టేకింగ్ మెచ్చుకోవచ్చు. బుల్లితెరపై అతడు, ఖలేజా రెండూ ఇప్పటకీ కూడా టీఆర్పీల్లో టాప్ లేపుతాయి. ఇక అతడు సినిమా వెనక ఆసక్తికర సంఘటనలే జరిగాయి. ముందుగా త్రివిక్రమ్ ఈ కథను పవన్ కళ్యాణ్‌తో చేయాలని అనుకున్నారు. పవన్‌కు కథ చెప్పడం ప్రారంభించిన వెంటనే పవన్ నిద్రలోకి జారుకున్నాడట. ఆయనకు కథ నచ్చలేదని డిసైడ్ అయిన త్రివిక్రమ్ ఓ రోజు పద్మాలయా స్టూడియోలో కృష్ణ, మహేష్‌బాబుకు కలిసి మరీ ఈ కథ చెప్పడం.. వాళ్లకు నచ్చి ఓకే చెప్పడం జరిగిపోయాయి.
అయితే కృష్ణ ఈ సినిమాను తమ పద్మాలయా బ్యానర్లో చేయాలని చెప్పారు. అప్పటికే త్రివిక్రమ్లోని టాలెంట్ గుర్తించిన జయభేరి అధినేత, సీనియర్ నటుడు మాగంటి మురళీమోహన్ తన బ్యానర్లో సినిమా చేయాలని త్రివిక్రమ్‌కు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే అప్పటికే త్రివిక్రమ్ స్రవంతి రవికిషోర్‌కు సినిమా చేస్తానని మాట ఇవ్వడంతో ఆ బ్యానర్లో తరుణ్‌తో నువ్వే నువ్వే సినిమా చేశాక సినిమా చేస్తానని చెప్పారు.
తాను మురళీమోహన్‌కు కమిట్ అయిన విషయం చెప్పడంతో కృష్ణ, మహేష్‌బాబు ఆ బ్యానర్లోనే అతడు చేసేందుకు ఓకే చెప్పారు. అప్పటికే వర్షం సినిమాతో పాపులర్ అయిన త్రిషను హీరోయిన్గా తీసుకున్నారు. మురళీమోహన్ సమర్పణలో డి. కిషోర్, ఎం.రామ్మోహన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 3 నంది పురస్కారాలతో పాటు, ఉత్తమ దర్శకుడి విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కించుకుంది.
ఈ సినిమాలో నాజర్ పోషించిన తాత సూర్యనారాయణ మూర్తి పాత్రకు ముందుగా శోభన్‌బాబును అనుకున్నారు మురళీమోహన్. అయితే అప్పటికే ఆయన సినిమాలు మానేసి చాలా కాలం అయ్యింది. మురళీమోహన్ ఆ సినిమా కోసం శోభన్‌బాబుకు బ్లాంక్ చెక్ ఇచ్చారు. అయినా ఆయన తిరస్కరించారు. దీంతో ఆ ప్లేస్‌లో నాజర్‌ను తీసుకున్నారు. అలా శోభన్‌బాబు – మహేష్‌బాబు కాంబినేషన్లో రావాల్సిన అతడు సినిమా అలా మిస్ అయిపోయింది.