సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి రామానాయుడు కెరీర్ ప్రారంభంలోనే కృష్ణ – శోభన్ బాబు హీరోలుగా ముందడుగు సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు కే రాఘవేంద్రరావు కజిన్ కే బాపయ్య దర్శకత్వం వహించారు. ఈ ముందడుగు సూపర్ డూపర్ హిట్ గాని నిలిచింది. రామానాయుడుకు కెరీర్ ప్రారంభంలోనే ఇది మల్టీస్టారర్ సినిమా.. పైగా భారీ బడ్జెట్. ఏమవుతుందో అని రామానాయుడు ఒక్కటే టెన్షన్‌గా ఉండేవారట. అయితే బాపయ్య పక్కా ప్లానింగ్‌తో 4 నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు.
ఆ రోజుల్లోనే ఈ సినిమా 365 రోజులు ఆడి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలోనూ రామానాయుడు ఒక పట్టాన ఒప్పుకోలేదు. అప్పటికే జగ్గయ్య హీరోగా ముందడుగు సినిమా తెరకెక్కింది. ఎప్పటిదో పాత టైటిల్ ఉండగా… మళ్లీ అదే టైటిల్ ఏంటని రామానాయుడు పేరు మార్చాలనేవారట. అయితే మరో సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి.. పరుచూరి సోదరులు నీతో ముందడుగు వేయించాలని అనుకుంటున్నారు… నువ్వేంటి వెనకడుగు వేస్తున్నావు అనగానే రామానాయుడు కాసేపు తట పటాయించి ముందడుగు… ముందడుగు అంటూ తన అడుగును ముందుకు వేస్తూ వెంటనే ఓకే చెప్పేసారట.
ఈ సినిమా 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పరుచూరి సోదరులు సురేష్ బాబుతో జరిపిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే సురేష్ బాబు ఈ సినిమాతోనే తాను సినిమాల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నట్టు తెలిపారు. ఈ సినిమా కథ చర్చల కోసం సురేష్ బాబు, పరుచూరి సోదరులు కే బాపయ్య ఇంటికి వెళ్లేవారట. ఆ ఇంట్లోనే కథ, స్క్రీన్ ప్లే, కథా విస్తరణ అంతా నడిచిందట.
ఇక ఆ ఇంటితో సురేష్‌బాబుకు మంచి అనుబంధం కూడా ఉండేదట. సురేష్ బాబు చిన్నప్పుడు బాపయ్య గారి ఇంటికి ఆయన భార్యతో ట్యూషన్ చెప్పించుకునేందుకు వెళ్లేవాడట. అలా బాపయ్య గారి కుటుంబంతో తనకు ముందు నుంచి మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా సురేష్ గుర్తు చేసుకున్నారు. ఇక బాపయ్య సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు.