Gossipsఎవడు మిగిలాడు ఎవడు పోయాడు...

ఎవడు మిగిలాడు ఎవడు పోయాడు…

తెలుగు సినిమా మార్కెట్లో త‌మిళ క‌థానాయ‌కులు, డైరెక్ట‌ర్ల‌ హ‌వా పెరుగుతోంద‌నడానికి ఇటీవ‌ల విడుద‌లైన తెలుగు సినిమాలే నిద‌ర్శనం! అదేంటి అంటారా.. అంతే మ‌రి! శుక్ర‌వారం వ‌స్తే చాలు తెలుగునాట థియేట‌ర్లు కొత్త పోస్ట‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. అభిమానుల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. స్టార్ హీరోలంద‌రూ పండ‌గ‌ల‌ను టార్గెట్ చేస్తుంటే.. చిన్న హీరోలు మాత్రం త‌మ భ‌విష్య‌త్‌ను ఇలాంటి అన్‌సీజ‌న్లో ప‌రీక్షించుకుంటారు. అయితే ఈ వారం విడుద‌లైన నాలుగు తెలుగు సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌మిళ అనుభూతిని పంచుతున్నాయి. మ‌రి వీటిలో ఏ సినిమా హిట్టు, ఏ సినిమా ఫ‌ట్టు అనేది ఒకసారి ప‌రిశీలిద్దాం!!

అదిరింది, డిటెక్టివ్‌, ఒక్క‌డు మిగిలాడు, కేరాఫ్ సూర్య‌.. ఈ నాలుగు త‌మిళ సువాస‌న‌లున్న వంటకాలే! వీటిలో అదిరింది, డిటెక్టివ్ త‌మిళం నుంచి తెలుగులోకి డ‌బ్బింగ్ చేసిన‌వయితే.. ఒక్క‌డుమిగిలాడు, కేరాఫ్ సూర్య సినిమాల‌కు ద‌ర్శ‌కులు అక్క‌డివారే కావడం విశేషం! ఇక వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అదిరింది గురించి. త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్‌.. హీరోగా న‌టించిన ఈ సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. జ‌క్క‌న్న రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందించిన ఈ సినిమా.. అన్ని అడ్డంకులు తొల‌గించుకుని సెన్సార్ కోత‌ల త‌ర్వాత తెలుగులో విడుదలైంది. ఈ సినిమాకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. విజ‌య్‌తో పాటు ఇటీవ‌ల స్పైడ‌ర్‌లో మెరిసిన ఎస్‌జే సూర్య న‌టన కూడా హైలైట్‌గా నిలిచింది. యూనివ‌ర్స‌ల్ క‌థాంశంతో వ‌చ్చిన సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌కు నచ్చింద‌నే చెప్పాలి.
ఇక అప్పుడ‌ప్పుడూ తెలుగు తెర‌పై సంద‌డి చేసే విశాల్‌.. డిటెక్టివ్‌గా వ‌చ్చాడు. ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో చిన్న పాయింట్ దగ్గ‌ర మొద‌లుపెట్టి దాని విస్తృతి పెంచుకుంటూ వెళ్లాడు డైరెక్ట‌ర్‌. డిటెక్టివ్ క‌థ‌లంటే ఇష్ట‌ప‌డే వారికి ఇది న‌చ్చుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక ఒక్క‌డు మిగిలాడు సినిమా రెగ్యుల‌ర్ సినిమా ఫార్మేట్ కాద‌నే విష‌యం ట్రైల‌ర్ చూసిన వారికి అర్థమైపోతుంది. మంచు మ‌నోజ్ ఎల్‌టీటీఈ చీఫ్ ప్ర‌భాక‌ర‌న్‌గా, విద్యార్థి నాయ‌కుడిగా రెండు గెట‌ప్పుల్లో క‌నిపించ‌డం.. హైలైట్‌గా నిలిచింది. త‌మిళ డైరెక్ట‌ర్ ఆండ్రూస్ శ్రీ‌లంక‌లోని త‌మిళుల క‌థాంశాన్నే ఎన్నుకు న్నాడు. సామాజిక క‌థాంశంతో రావ‌డం, తెలుగు ప్రేక్ష‌కులకు ఈ సినిమా ఎక్కువ‌గా క‌నెక్ట్ కాద‌నే వాద‌న వినిపిస్తోంది!

ఇక కేరాఫ్ సూర్య విష‌యానికొస్తే.. వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ త‌ర్వాత‌.. ఆ స్థాయి విజ‌యం కోసం ఎదురుచూస్తున్న హీరో సందీప్ కిష‌న్‌.. త‌మిళ డైరెక్ట‌ర్ సుశీంద్ర‌న్‌తో క‌లిశాడు. ఇందులో క‌థ అంతా రొటీన్‌గా అనిపించినా.. హీరో-విల‌న్ మ‌ధ్య సాగే స‌న్నివేశాలు ఆస‌క్తిగా ఉంటాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఇక చివ‌రిగా ఇందులో హీరోయిన్ పాత్ర‌ల‌కు కూడా అంత ప్రాధాన్యం లేద‌నేది కాద‌న‌లేని వాస్త‌వం! ఇలా నాలుగు క‌థ‌లు.. నాలుగు జోనర్లు! మ‌రి వీటిలో అదిరింది తెలుగులోనూ అదిరింద‌నే చెప్పుకోవాలి! ఇక ఒక్కడు మిగిలాడు, కేరాఫ్ సూర్య సినిమాలు సోసో గా అనిపిస్తాయి! డిటెక్టివ్ ఒక వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ట‌. ఇక ఫైన‌ల్‌గా వ‌సూళ్ల ప‌రంగా అదిరింది అదుర్స్ అనిపించ‌వ‌చ్చు. సినిమా ప‌రంగా మాత్రం డిటెక్టివ్‌కే ఎక్కువ మార్కులు వేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news