దర్శక రత్న దాసరి నారాయణరావు గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయనకు తెలియనివారు.. తెలి యని రంగం అంటూ ఏదీ లేదు. మేఘసందేశం.. వంటి అజరామరాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే.. ఆయన దర్శకుడిగానే కాకుండా.. మధ్యవర్తిగా కూడా ఎంతో మందిని ఆపదల నుంచి బయట పడేశారు. ఇలాంటి ఘటనలో ఒకసారి దాసరి లేకపోతే.. ఒక సినిమానే కాదు.. ఒక కుటుంబమే తెరమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
విషయం ఇదీ.. శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా వాసు దర్శకత్వంలో దేవుడు మామయ్య పేరుతో ఓ సినిమా తీశారు. దీనికి నిర్మా త అప్పట్లోక్యారెక్టర్ ఆర్టిస్టు విజయలలిత. ఈ సినిమాను ఏ ముహూర్తంలో ప్లాన్ చేశారో తెలియదు కానీ.. అడుగడుగునా అడ్డంకులు వచ్చాయి. తొలి అడ్డంకి.. వదిలిందిలే అనుకుంటే.. మలి అడ్డంకి.. మరింతగా కుంగదీసింది. దీంతో సినిమా ఏకంగా.. ఏడాది పాటు ఆలస్యమైంది. ఇంత చేస్తే.. ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోయి.. అట్టర్ ఫ్లాప్ కావడం మరో చర్చనీయాంశం.
ఈ సినిమాకు ఫైనాన్స్ విషయం సెటిల్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్స్ సహకరించకపోవడంతో 1980లో విడుదల కావాల్సింది ఆగిపోయింది. దీంతో నిర్మాత విజయలలిత ఎంత ప్రయత్నించినా పనికాలేదు. ఇక తన వల్ల కాకపోవడంతో దర్శకరత్న దాసరి నారాయణరావును ఆశ్రయించారు. దీంతో దాసరి రంగంలోకి దిగి ఫైనాన్షియర్లు, డిస్టిబ్యూటర్స్‌తో మాట్లాడి సెటిల్ చేశారు. అలా 1980 జనవరి 14న విడుదల కావాల్సిన ‘దేవుడు మావయ్య’ చిత్రం 1981 జనవరి 14న విడుదలైంది. అంటే.. ఏడాది లేటన్నమాట.
పోనీ.. ఇప్పుడైనా పరిస్థితి చక్కబడిందా? అంటే అది కూడా లేదు. ఎందుకంటే.. తనకు ఇవ్వాల్సిన 80 వేల రూపాయల పారితోషికానికి బదులు 30 వేలు ఇవ్వడంపై వాణిశ్రీ కోర్టుకెక్కారు. తనకు ఇవ్వాల్సిన 50 వేల రూపాయలు ఇవ్వకుండా సినిమా విడుదల చేశారనీ, ఆ డబ్బు తనకు ఇప్పించండంటూ వాణిశ్రీ ఆ కేసు వేశారు. తీర్పు వచ్చేవరకూ పంపిణీదారులు నిర్మాతలకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఆపుజేయాలని ఆమె పిటీషన్ దాఖలు చేశారు. మళ్లీ దాసరి మధ్యవర్తి పోస్టు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారన్నమాట.